కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు వైసీపీ కార్యకర్తలు.. కర్నూలు ద్రోహి అంటూ నినాదాలు చేశారు.. మూడు రాజధానులు కావాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ శ్రేణులు ఓవైపు.. సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ శ్రేణులు మరోవైపు నినాదాలు, తోపులాటలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, వారిపై అదేస్థాయిలో విరిచుకుపడ్డారు చంద్రబాబు.. ఈ రాత్రికి ఇక్కడే ఉంటా.. మీ సంగతి చూస్తానంటూ ఘాటుగా స్పందించారు.. ఇక, చంద్రబాబు వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్.. చంద్రబాబు రౌడీ షీటర్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ ఆయన.. నష్టపోయిన రాయలసీమ వాసులపై పుండు మీద కారం చల్లినట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, చంద్రబాబు సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్.. తాము అనుకొని ఉంటే చంద్రబాబు కర్నూలు దాటి వెళ్లలేరు అంటూ హెచ్చరించారు.. టీడీపీ ఆఫీస్ పైనే కాదు.. చంద్రబాబు ఇంటి మీదకు కూడా వెళ్తామని ప్రకటించారు హఫీజ్ ఖాన్.. కర్నూలుకు హైకోర్టు రాకుండా అడ్డుకుంటారా? అని ఫైర్ అయ్యారు.. ప్రజలను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇలా మాట్లాడతారా? అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడినా కర్నూలు ప్రజలు రెచ్చిపోలేదు. గూండాల అవసరం చంద్రబాబుకే ఉంటుందన్నారు.. కాగా, రాయలసీమలో ముఠా నేతలను అణచివేసిన పార్టీ తెలుగుదేశం.. మిమ్మల్ని అణచివేయడం కష్టమేమీ కాదు.. రాజకీయ రౌడీలు వస్తున్నారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ధర్మాన్ని కాపాడేందుకు అందరూ ముందుకు రావాలి అంటూ చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం విదితమే. అంతే కాదు, ఇవే నా చివరి ఎన్నికలకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అంటూ చంద్రబాబు.. కర్నూలు జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు చర్చగా మారిన విషయం విదితమే.