వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి ప్రతిష్టాత్మక “ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్”లో స్థానం లభించింది. పర్యావరణ హితాన్ని కోరుతూ లక్షా 24 వేల మట్టి విగ్రహాలను తయారు చేయించడంతో పాటు ప్రజలకు ఉచితంగా ఇంటింటికి అందించడంలో విశేష కృషి చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ అవార్డుకు అర్హత సాధించారు. తిరుపతి రూరల్ పరిధిలోని చిగురువాడ అకార్డ్ స్కూల్ అవరణలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే చెవిరెడ్డి చేస్తున్న కృషిని గుర్తిస్తూ..”ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్” సంస్థ ప్రతినిధులు అవార్డుతో పాటు గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అంతే కాకుండా తమ సంస్థకు శాశ్వత సభ్యత్వాన్ని కూడా అందించారు.
Read Also: Bank Holidays: ఏకంగా 13 రోజులు బ్యాంకుల మూత..!
ఇక, పుడమిని, ప్రకృతిని పరిరక్షించే విధానంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లా ఎవరు పర్యావరణ హితం కోరి వేరెవరూ చర్యలు చేపట్టలేదని ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధి ఉమాశంకర్ పేర్కొన్నారు. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ అందుకోవడం పట్ల తుడా వీసీ హరికృష్ణ, సెక్రటరీ లక్ష్మీ, ఇతర ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. అయితే, తానూ ప్రాతినిథ్యం వహిస్తోన్న చంద్రగిరి నియోజకవర్గంలో 1.24 లక్షల మట్టి విగ్రహాలు ఎక్కడికక్కడ తయారు చేసి పంపిణీ చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వివరించారు. ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. పదేళ్లుగా చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.