కృష్ణా జిల్లా వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గన్నవరంలోని వైసీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో గన్నవరం వైసీపీ క్యాడర్ వైసీపీ కీలక నేత, పార్టీ వ్యవహారాల శాఖ ఇంఛార్జి విజయసాయిరెడ్డికి లేఖ రాసింది. ఈ లేఖ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు వల్లభనేని వంశీకి అప్పగించొద్దని వైసీపీ కార్యకర్తలు లేఖలో విజయసాయిరెడ్డిని కోరారు. తాము 9 సంవత్సరాల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గన్నవరంలో వైసీపీని కాపాడుకుంటూ వస్తున్నామని వైసీపీ పార్టీ నేతలు లేఖలో వివరించారు. నియోజకవర్గ బాధ్యతలు వల్లభనేని వంశీకి తప్ప ఎవరికి అప్పగించినా 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని విజయసాయిరెడ్డికి వైసీపీ క్యాడర్ స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై కొద్దిరోజులు ఓపిక పట్టాలని కార్యకర్తలను విజయసాయిరెడ్డి కోరారు. సీఎం జగన్‌తో చర్చించి యార్లగడ్డ వెంకట్రావ్‌కు తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.