YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి, వాచ్‌మెన్ రంగన్న మృతి పై అనుమానాలు ఉన్నాయంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రంగన్న మృతి గల కారణాలను సమగ్రంగా విచారించడం కోసం కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రంగన్న మృతిపై పలు అనుమానాలు రావడంతో సిట్ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేపట్టనున్నారు. సిట్ బృందంలో ఒక డీఎస్పీతో పాటు ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 6 మంది కానిస్టేబుల్స్ తో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు.. గురువారం పోస్టుమార్టం అనంతరం రంగన్న మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, రంగన్న మృతిపై అనుమానాలు రావడంతో సమగ్ర విచారణకు మరో మారు రీ పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పులివెందులలో రంగన్న మృతదేహానికి రేపు నలుగురు వైద్యుల బృందం రీ పోస్టుమార్టం నిర్వహించి మరిన్ని నమూనాలను సేకరించనున్నారు.
Read Also: International Women’s Day: ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” స్టోరీ ఇదే..
అయితే, వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షి, వాచ్‌మెన్ రంగన్న మృతిపై కూడా ఏపీ కేబినెట్‌లో చర్చ జరిగింది. వివేకా హత్య కేసులో సాక్షులు, నిందితులుగా ఉన్నవారిలో నలుగురు చనిపోవడంపై మంత్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. పరిటాల రవి హత్య కేసులో కూడా సాక్ష్యులు ఇలానే చనిపోయారని సీఎం చంద్రబాబుకు చెప్పారు. రంగన్న మృతి అనుమానాస్పదంగా ఉందని సీఎం చంద్రబాబు కూడా అభిప్రాయపడ్డారు. దీనిపై డీజీపీ హరికుమార్ గుప్తాను వివరణ కోరగా… ఆ మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. దీంతో.. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించింది కేబినెట్. ఇక, ఈ కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై విచారణ చేస్తామన్న ఆమె.. సాక్షుల వరుస మరణాల అంశంపై కేబినెట్‌లో చర్చించాం సమగ్ర దర్యాప్తు జరపాలని అదేశించాం అన్నారు.. ఈ కేసులో ప్రధాని సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న మృతి డైవర్షన్ అనాలో లేదా కొసమెరుపు అనాలో అర్థం కావడం లేదన్నారు.. రంగన్న మరణంపై పోస్ట్ మార్టం తరువాత అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. వివేక హత్య కేసులో ఎవరి మరణాలు అయినా మిస్టరీగా మాత్రం మిగలవు. వివేక హత్య కేసులో ఎవ్వరూ తప్పు చేసిన శిక్ష తప్పదు. కొంగ జపాలు చేసిన తలకిందులుగా తపస్సు చేసినా.. తప్పు చేసిన వారికి శిక్ష మాత్రం తప్పదు హోం మంత్రి వంగలపూడి అనిత వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే.