Minister Ramprasad Reddy: గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి మాస్ వార్నింగ్.. నేరుగా తేల్చుకుందాం..!

Mandipalli Ramprasad Reddy

Mandipalli Ramprasad Reddy

Minister Ramprasad Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అండర్‌గ్రౌండ్ రాజకీయాలు మానుకోవాలని, దమ్ముంటే నేరుగా రావాలని సవాల్ విసిరారు. నాలుగు రోడ్ల కూడలిలో ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయచోటి రాజకీయాల్లో అనవసర ఉద్రిక్తతలు సృష్టించవద్దని శ్రీకాంత్ రెడ్డిని హెచ్చరించారు.

గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇంటి ముందు నుంచి టీడీపీ నేతల వాహనాలు వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు రాంప్రసాద్‌ రెడ్డి. టీడీపీ నేతల కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా నిన్న టీడీపీ కార్యకర్తల ఇళ్ల వద్దకు వెళ్లి దౌర్జన్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇకనైనా ఇలాంటి శిఖండి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే గతంలో చెప్పినట్లుగానే హైదరాబాద్ నుంచి రాయచోటికి రాకుండా అడ్డుకుంటామని, గువ్వలచెరువు ఘాట్ వద్దే నిలిపివేస్తామని హెచ్చరించారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి రాజకీయాల కోసం రాయచోటి ప్రాంతాన్ని బలిచేయవద్దని మంత్రి వ్యాఖ్యానించారు. నామినేషన్లు వేయకుండా ఉండి, ఏకగ్రీవాలు అయ్యాయని ఇప్పుడు గగ్గోలు పెడుతూ మళ్లీ ఎన్నికలు కావాలని కోరడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ విషయంలో ఇకపై వెనక్కి తగ్గేది లేదని, తన వ్యాఖ్యలను వార్నింగ్‌గా భావించినా మరోలా అనుకున్నా ఇదే తుది హెచ్చరిక అని స్పష్టం చేశారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..