Kadapa Crime: కడప జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయారు.. తనను ప్రేమించలేదని ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. వేముల మండలం కొత్తపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న షర్మిల అనే యువతిపై కులయప్ప అనే యువకుడు కత్తితో దాడి చేశారు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు రావడంతో వారిని చూసి కులయప్ప పరారయ్యారు. అయితే, రక్తపు మడుగులో ఉన్న షర్మిలను చికిత్స కోసం బంధువులు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో పులివెందులలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె శరీరంపై 14 కత్తిపోట్లు ఉన్నాయని డాక్టర్లు గుర్తించారు. షర్మిల అపస్మారక స్థితిలో ఉండడంతో పాటు రక్తస్రావం ఎక్కువగా అవుతుండడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు. షర్మిల తండ్రి వీఆర్ఏగా పనిచేస్తూ రెవెన్యూ గ్రామసభలు కోసం గొందిపల్లెకు వెళ్లారు. తల్లి కూలి పనికి వెళ్లడంతో ఇంట్లో షర్మిల ఒక్కరే ఉన్నారు.. అయితే, ఇదే అదునుగా భావించిన ఉన్మాది.. ఇంట్లోకి దూరి ఘాతుకానికి పాల్పడ్డాడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు బంధువులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: Khans: ఆడియన్స్ కి దూరంగా త్రీఖాన్స్.. ఎందుకబ్బా?