Gudlavalleru Engineering College Incident: కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల వ్యవహారంపై పెద్ద రచ్చే జరిగింది.. అయితే.. అలాంటి ఏమీ లేదని తేల్చారు పోలీసులు.. కానీ, ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. గుండ్లవల్లేరు ఘటనలో నూటికి నూరు శాతం హిడెన్ కెమెరాలు అంశం దాగి ఉందని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు.. కడప నగరంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడిన ఆమె.. రెండు షవర్లను చీకట్లో పోలీసులు ఎత్తుకెళ్లడంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు.. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ బెదిరించడం.. తెల్లారేసరికి పరిస్థితులు మారుతాయి అనడం.. అనుమానాలకు తావిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
అయితే గుండ్ల వల్లేరు ఘటనలో ఎటువంటి హిడెన్ కెమెరాలు లేవని పోలీసులు అంటుంటే మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మాత్రం నూటికి నూరు శాతం హిడెన్ కెమెరాలు అంశం దాగి ఉంది అనడం సంచలనంగా మారింది. కాగా, ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. తొలిసారి సీఈఆర్‌టీ సేవలను ఉపయోగించారు.. పోలీసు బృందాల దర్యాప్తు అప్డేట్స్ పై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.. కళాశాలలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని ఆయన స్పష్టం చేశారు.. క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) సేవలు వినియోగించాం. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేశాం.. కళాశాల వ్యవహారంపై ముగ్గురు ఐజీలు దర్యాప్తు చేశారు.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా పోలీసుల విచారణ జరిగిందన్నారు.. హాస్టల్ వాష్ రూమ్‌ల్లో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు వచ్చిన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశాం. విద్యార్థులు, స్త్రీ శిశు సంక్షేమ, పోలీసు బృందాల సమక్షంలో… ఆరోపణలు వచ్చిన వెంటనే హాస్టల్ వాష్ రూమ్‌ల్లో తనిఖీలు చేశాం అన్నారు ఐజీ అశోక్ కుమార్.. వాష్ రూమ్‌లు, షవర్లలో ఎటువంటి కెమెరాలు గుర్తించలేదని స్పష్టం చేశారు. విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ నేరుగా విచారించాం.. విచారణలో కెమెరాలు కానీ, ఆరోపిస్తున్న వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరు చెప్పలేదన్నారు.. కెమెరాల ఏర్పాటు, వీడియోలు అంశం ఎవరో చెబితేనే తమకు తెలిసిందని విచారణలో అందరూ చెప్పారని వెల్లడించారని స్పష్టం చేశారు ఐజీ అశోక్ కుమార్.. కానీ, ఏపీ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో.. ఈ కేసులో బిగ్ ట్విస్ట్ వచ్చి చేరినట్టు అయ్యింది.