YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. “తుఫాన్ కారణంగా పంటలు బాగా నష్టపోయాయి. ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు తుఫాన్ తాకి దిగుబడులు తగ్గిపోయాయి. నేలకొరిగిన పంట తిరిగి నిలబడే అవకాశం లేదు. దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపగా, 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి,” అని తెలిపారు.
11 లక్షల ఎకరాల్లో వరి, 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరు శనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు నష్టపోయాయని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆర్బీకే వ్యవస్థ అప్రమత్తంగా ఉండేదని, ప్రతి పంటకూ ఈ-క్రాప్ చేసేవాళ్లమన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు సమన్వయంతో రైతులకు సహాయంగా నిలిచేవని, ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు భరోసా ఇచ్చామన్నారు జగన్.
85 లక్షల మంది రైతులు బీమా పరిధిలో ఉండేవారని, 70 లక్షల ఎకరాలు పంట బీమా కవరేజ్‌లో ఉండేవని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రీమియం కట్టిన రైతుల్లో 19 లక్షల మందికి మాత్రమే బీమా అందుబాటులో ఉందని జగన్ తెలిపారు. మిగతా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.
“ఈ 16 నెలల్లో అల్పపీడనలు, వాయుగుండాలు, తుపాన్లు 16 సార్లు వచ్చాయి. కానీ నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేకపోయింది. ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. ఇ-క్రాప్ వ్యవస్థను నీరుగార్చేశారు,” అని ఆయన విమర్శించారు. అలాగే, “మిర్చికి క్వింటాలుకు రూ.11,781 ఇస్తామని మాట ఇచ్చారు, కానీ రైతుకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. పొగాకు, మామిడి, ఉల్లి వంటి పంటలకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేదు. ఇవన్నీ మానవ తప్పిదాలు, చంద్రబాబు పాలనలో సృష్టించిన విపత్తు ఇది,” అని వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా.. వైసీపీ ప్రభుత్వం కాలంలో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,800 కోట్ల బీమా ఇచ్చాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేసింది అని ఆయన వ్యాఖ్యానించారు.
రెండు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరకిన ఇన్‌స్పెక్టర్