ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్.ఆర్.ఆర్ సినిమా మేనియా నడుస్తోంది. ఎప్పటి నుంచో మెగా, నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న మూవీ మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు RRR సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ టీ కప్పులతో ఎన్టీఆర్, రామ్‌చరణ్ చిత్రాలను ఆవిష్కరించాడు. దీని కోసం అతడు ఏకంగా 15వేల టీ కప్పులను ఉపయోగించాడు.
చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం చిన్నపర్తికుంటకు చెందిన పురుషోత్తం అనే యువకుడికి ఎప్పుడు వినూత్నంగా ఆలోచించడం అలవాటు. అందుకే చిన్నతనం నుంచే ఉప్పుతో బొమ్మలు వేసేవాడు. అయితే RRR సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ మూవీలో నటించిన ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలను టీ కప్పులతో వేయాలని ఆలోచించాడు. దీంతో కష్టపడి ఆరు రోజులు శ్రమించి టీ కప్పులతో ఎన్టీఆర్, రామ్‌చరణ్ చిత్రాలను రూపొందించి ఔరా అనిపించాడు. ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేని ఆర్ట్ వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
మరోవైపు అమెరికాలోనూ ఆర్.ఆర్.ఆర్ మేనియా కొనసాగుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ మూవీ కోసం నానా హంగామా చేస్తున్నారు. తాజాగా కార్లతో జై ఎన్టీఆర్, ఆర్.ఆర్.ఆర్ అనే అక్షరాలను రూపొందించారు. దీని కోసం తారక్ అభిమానులు ఎంత శ్రమపడ్డారో కూడా వీడియో తీసి పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఎన్టీఆర్ అభిమానులు 70 కార్ల ర్యాలీని ఏర్పాటు చేసి జై ఎన్టీఆర్, ఆర్.ఆర్.ఆర్ అని డ్రోన్ షాట్‌కు తగ్గట్లు ఒక చోట చేర్చి వీడియో తీశారు. ఇందుకోసం అభిమానులు భారీ ఖరీదైన కార్లను ఉపయోగించారు.