ఏపీలో ప్రస్తుతం నెల్లూరు రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితులు నెల్లూరులో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి పర్యటన సందర్భంగా నెల్లూరు నగరంలో ఆయన అనుచరులు భారీ ర్యాలీ నిర్వహించాలని తలపెట్టారు. అంతేకాకుండా భారీగా స్వాగత ఏర్పాట్లు కూడా చేశారు.
మరో వైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నెల్లూరులో గాంధీ సర్కిల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రతిష్టాత్మకంగా ఈ సభ నిర్వహించాలని అనిల్ కుమార్ అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు. ఒకే సమయంలో ఒకే పార్టీకి చెందిన ఇరువురి నేతల కార్యక్రమాలు ఉండటంతో నెల్లూరులో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
అయితే ప్రస్తుతం నెల్లూరులో నెలకొన్న రాజకీయాలపై వైసీపీ పార్టీ అధిష్టానం గుర్రుగా ఉంది. దీంతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవర్ధన్‌రెడ్డితో పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఫోన్‌లో మాట్లాడారు. ఎలాంటి వివాదాలు, విమర్శలు లేకుండా ఇరువురు నేతలు కార్యక్రమాలు జరుపుకోవాలని సూచించారు. ఒకవేళ తమ సూచనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని పార్టీ పెద్దలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాగా సర్వేపల్లి నియోజక వర్గం నుంచి గెలుపొందిన కాకాణి జనార్ధన్‌రెడ్డికి ఇటీవల కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవి దక్కింది.