ఎన్నికల ముందు ఏపీలో హాట్ హాట్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అధికార-ప్రతిపక్ష నాయకులు భారీ సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇంకోవైపు విమర్శలు-ప్రతి విమర్శలతో వేడి పెంచేస్తున్నారు. కొంత మంది అభ్యర్థులను ఇప్పటికే ఆయా పార్టీలు ప్రకటించేశాయి. ఇంకొంతమందిని ప్రకటించాల్సి ఉంది. ఇక అభ్యర్థుల ప్రకటన తర్వాత అలకలు కూడా మొదలయ్యాయి. ఇంకోవైపు బుజ్జగింపులు కూడా జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లా కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డికి వైసీపీ టికెట్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారతారని వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరారు. అదే బాటలో మహీధర్‌రెడ్డి కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండ్రోజుల క్రితమే మహీధర్‌రెడ్డితో వేమిరెడ్డి భేటీ అయి తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. కానీ ఆయన చేరికపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మహీధర్‌రెడ్డి నివాసానికి వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి వచ్చారు. కందుకూరు మండలం మాచవరంలోని ఎమ్మెల్యే స్వగ్రామంలో ఆయనతో సమావేశం అయ్యారు. దాదాపు గంటన్నర పాటు మహీధర్ రెడ్డితో సుదీర్ఘ మంతనాలు జరిపారు.
ఇటీవలే కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహీదర్ రెడ్డికి కాకుండా వైసీపీ ఇంచార్జ్‌గా బుర్రా మధుసూధన్ యాదవ్‌కు హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది. అలాగే నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి పేరు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మర్యాదపూర్వకంగా విజయసాయిరెడ్డి కలిశారని మహీధర్‌రెడ్డి అనుచరులు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి భేటీ తర్వాత కందుకూరు నియోజకవర్గంలో మార్పులు జరగొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరీ ఏం జరుగుతుందో వేచి చూడాలి.