పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్త కనిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేశారు. దీంతో నాగులు ఇంటి సభ్యులు ప్రాణభయంతో ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. ఈ దాడి ఘటనపై పోలీసులు సమాచారం అందుకుని టీడీపీ కార్యకర్త ఇంటికి చేరుకోవడంతో వైసీపీ వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయలేదనే కక్ష్యతోనే వైసీపీకి చెందిన మున్సిపల్ ఛైర్‌పర్సన్ మునగ రమాదేవి భర్త, కుమారులు ఈ దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. కాగా వైసీపీ వర్గీయుల దాడిలో టీడీపీ కార్యకర్త నాగులు ఇంటికి సంబంధించిన బైక్, పలు ఫర్నీచర్ సామాగ్రి ధ్వంసమమ్యాయి. ఇంటి పక్కన ఉన్న పశువుల పాకపైనా దాడి చేయడంతో కొన్ని పశువులు కూడా గాయపడ్డాయి. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.