ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన గ్రామ సభలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తనకు మాట్లాడే అవకాశం కల్పించాలంటూ గ్రామ సభకు వచ్చిన వైసీపీ ఎంపీటీసీ కాజా రాంబాబు విజ్ఞప్తి చేశారు. తాను వైసీపీలోనే ఉంటూ గ్రామంలో జరిగిన రూ.75 లక్షల అవినీతిపై పోరాడుతున్నట్లు రాంబాబు చెప్పడంతో చంద్రబాబు ఆయనకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకా ప్రతాప్ తనయుడు అవినీతికి పాల్పడ్డాడంటూ చంద్రబాబుకు సంబంధిత పత్రాలనే రాంబాబు అందజేశారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని.. ఎమ్మెల్యే తనయుడు అవినీతిపై పోరాటానికి మద్దతివ్వాలని కోరారు.
అయితే రాoబాబుకు మాట్లాడే అవకాశం కల్పించటంపై టీడీపీ శ్రేణులు అడ్డుచెప్పాయి. దీంతో అవినీతిపై రాంబాబు చేసే పోరాటాన్ని పార్టీలకతీతంగా చూడాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు నచ్చచెప్పారు. రాంబాబును సభలో అభినందించి తనకు చేతనైన సాయం చేస్తానని భరోసా కల్పించారు. వైసీపీ ఓ అవినీతి వృక్షమని, తల మొత్తం అవినీతి మయమైనప్పుడు పార్టీలో మొండెం పోరాడినా ఫలితం లేదంటూ చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల చెవిలో పూలు పెట్టానని భావిస్తున్న జగన్‌కి ప్రజలంతా కలిసి చెవిలో పూలు పెట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. అరెస్టులకు భయపడి రైతులు రోషం చంపుకోవద్దని సూచించారు. ఎన్ని కేసులు పెట్టి ఎంతమందిని భయపెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలవరంలో అవినీతి అని దుష్ప్రచారం చేశారని.. కొండను తవ్వి ఎలుక తోకపై వెంట్రుక కూడా పట్టుకోలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు పెట్టకుండా అడ్డుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.