ఏపీలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఫలితాల్లో వైసీపీ ఫ్యాన్ గాలి వీచింది. 13 జిల్లాల్లో అధికార పార్టీ హవా చాటింది. ఇప్పటి వరకు 90శాతానికిపైగా జడ్పీటీసీలను వైసీపీ గెలుచుకోగా.. టీడీపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎంపీటీసీల్లోనూ వైసీపీ.. సత్తా చూపింది. చాలా జిల్లాల్లో క్వీన్ స్వీప్ చేసింది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ.. భారీస్థాయిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో అధికారపార్టీ గెలిచింది. ఈనెల 25న జడ్పీచైర్మన్ల ఎన్నిక జరగనుంది.. ఆంధ్రప్రదేశ్‌లో 6 వేల 985 ఎంపీటీసీ, 441 జెడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ ముగిసింది. పూర్తి స్థాయి ఫలితాలు రావడానికి మరికొంత సమయం పట్టనుంది.
ఎన్నికల ఫలితాల్లో వైసీపీ దూసూకెళ్లింది. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేసింది. కర్నూలులో మొత్తం 52 జడ్పీటీసీలు వైసీపీ కైవసం చేసుకుంది. నెల్లూరులో మొత్తం 46 జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 90 శాతనికి పైగా జడ్పీటీసీలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఎంపీటీసీల్లోనూ ఫ్యాన్ పార్టీదే హవా. మొత్తం 10 వేల 47 ఎంపీటీసీ స్థానాల్లో 2 వేల 371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ కారణాల రీత్యా ఎన్నికల ప్రక్రియ 375 స్థానాల్లో నిలిచిపోయింది. పోటీ చేసిన వారిలో 81 మంది అభ్యర్థులు మరణించారు. మిగిలిన 7 వేల 220 స్థానాలకుగాను 18 వేల 782 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఏప్రిల్ 8న ఆయా స్థానాలకు పోలింగ్ జరిగింది. కొవిడ్ జాగ్రత్తలతో 13 జిల్లాల్లో 209 కేంద్రాల్లో ఓట్లు లెక్కించారు..
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంచుకోట కుప్పం నియోజకవర్గంలోనూ టీడీపీకి ఎదురుగాలి వీచింది. టీడీపీ ఎన్నికలను బహిష్కరించినా కొందరు తెలుగు తమ్ముళ్లు బరిలోకి దిగారు. కుప్పం పరిధిలోని 19 ఎంపీటీసీ స్థానాలకుగానూ 17 వైసీపీ కైవసం చేసుకుంది. 2 స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లె ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ అభ్యర్థి కైవసం చేసుకున్నారు. మడకశిర మండలంలో 1 ఎంపీటీసీకి సంబంధించి రీపోల్‌కు అవకాశం ఉందని పంచాయితీ రాజ్ కమిషనర్ చెప్పారు. దీనిపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.సీఎం జగన్ పాలనకు మరోసారి ప్రజల నుంచి ఆశీస్సులు అందాయని వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అందుకు తాజా ఫలితాల ప్రభంజనమే నిదర్శనమని చెప్పారు. కొన్ని పార్టీలకు ఈ ఫలితాలు గుణపాఠాలని కామెంట్ చేశారు..పరిషత్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ స్పందించారు. దేవుడి దయ, అందరి దీవెనల వల్లే ఇంతటి అఖండ విజయం సాధ్యమైందని తెలిపారు. పూర్తి ఫలితాలు వచ్చాక మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటానని ట్వీట్ చేశారు..