ఎంత టెక్నాలజీ పెరిగినా.. నేరాలు మాత్రం తగ్గడం లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చోరీలు జరుగుతున్నాయి. మూడో కన్ను వున్నా.. తమ పని తాము కానిచ్చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఖతర్నాక్ చోరీ బయటపడింది. ఈ చోరీ ఉదంతం అంతా సీసీ టీవీ కెమేరాల్లో రికార్డ్ అయింది. వీరవాసరంలో బట్టల దుకాణంలో మహిళా దొంగలు హల్ చల్ చేశారు. పక్కా ప్లాన్ తో ఆరుగురు సభ్యుల ముఠాగా ఏర్పడి స్థానిక గణపవరం వారి బట్టల దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. సాయంత్రం దుకాణం మూసే వేళకు కస్టమర్లలా ప్రవేశించిన మహిళా దొంగలు తమ ప్లాన్ అమలు చేశారు.
Read Also: Nellore Rotten Meat Seize: నెల్లూరులో నాన్ వెజ్ కొంటున్నారా? బాబోయ్ ఇది తెలుసా?
యజమానిని ఏమార్చి 30 వేల రూపాయల విలువైన చీరలను ఎత్తుకుపోయారు. సరుకు తేడాను గుర్తించిన యజమాని సీసీ టీవీ పరిశీలించగా విషయం బయటపడింది. విడివిడిగా దుకాణంలోకి ప్రవేశించిన ఈ ముఠా సభ్యులు చోరీ అనంతరం ఒకే కారులో పరారైనట్లుగా సీసీటీవీలో రికార్డు అయింది. చోరీ గుర్తించి వెంటనే దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించినా దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వీరవాసరం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీకి పాల్పడింది ఎవరు? ఎక్కడినించి వచ్చారనేది దర్యాప్తు చేస్తున్నారు. ఈ సీసీ టీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. బట్టల దుకాణాల వారు ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా వుండాలని పోలీసులు సలహా ఇస్తున్నారు.
Read Also: Bharat Jodo Yatra: కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. నేడు షాద్ నగర్ నుంచి ముచ్చింతల వరకు