ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ఓ టైమ్ లైనులో ప్రకటిస్తాం.. పరిష్కరిస్తామని సీఎం చెప్పారని జేఏసీల ఐక్య వేదిక ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల్లో కొంత మేర మిశ్రమ స్పందన వచ్చిందని, అయినా ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యల పరిష్కారానికి టైమ్ బౌండ్ పెట్టడం సంతోషమన్నారు. హెచ్‌ఆర్ఏ, పెన్షనర్లకు అదనపు పెన్షన్ విషయంపై సీఎంఓ అధికారులతో మాట్లాడామని, హెచ్‌ఆర్ఏ, అదనపు పెన్షన్ విషయంలో సీఎస్ కమిటీ సిఫార్సులను పట్టించుకోవద్దని కోరామన్నారు.
హెచ్‌ఆర్ఏ విషయంలో ప్రస్తుత శ్లాబులనైనా కొనసాగించాలి.. లేదా పీఆర్సీ కమిషనర్ సూచించిన శ్లాబులనైనా పరిగణించాలని కోరామని వెల్లడించారు. అదనపు పెన్షన్ విషయంలో సీఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే పెన్షనర్లు ఇబ్బందులు పడతారని వివరించామని తెలిపారు. ప్రభుత్వంపై మాకు నమ్మకముందని, సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామన్నారు.