ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 11, 12 తేదీల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.. నిరసనలకు అవకాశం ఉన్న నేపథ్యంలో.. పటిష్ట చర్యలు చేపడుతున్నారు పోలీసులు.. సాగర నగరం ఇప్పటికే పోలీస్ వలయంలా మారింది.. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో నిరసనలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది.. విశాఖ నగరంలో హై టెన్షన్ నెలకొంది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు కార్మికులు, వామపక్షాలు, ప్రజాసంఘాలు చేపట్టిన ర్యాలీపై ఇప్పటికే పోలీసులు ఆంక్షలు పెట్టారు.. సాగర తీరం నిరసనలతో హోరెత్తే పరిస్థితి ఉండడంతో.. నగరాన్ని అడుగడుగునా జల్లెడ పడుతోంది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఓవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్.. మరోవైపు విశాఖ రైల్వే జోన్, ఏపీకి ప్రత్యేక హోదా, మూడు రాజధానుల వ్యవహారం.. ఇలా అనేక అంశాలే ఉన్నాయి.. ఒకే వేదికపైకి ప్రధాని మోడీ, సీఎం వైఎస్ జగన్ కూడా రానుండడంతో.. ఆందోళన ఉధృతం చేయాలని ఓవైపు.. ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకోవాలనే ప్లాన్ మరోవైపు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలకు అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటుంది పోలీస్ యంత్రాంగం..
Read Also: biryani Fighting: బిర్యానీ విషయంలో గొడవ.. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో ఆకాశ మార్గంలోనూ ఆంక్షలు విధించారు.. డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించినట్టు పోలీసులు స్పష్టం చేస్తున్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ సభ జరిగే ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి డ్రోన్లు ఎగరవేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు.. నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు డ్రోన్లపై నిషేధం అమల్లో ఉంటుందని.. ఉల్లంఘనలకు పాల్పడితే ఎయిర్ క్రాఫ్ట్స్ యాక్ట్ 1934కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్.. ఇక, ప్రధాని మోడీ.. తన పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.. రోడ్ షో నిర్వహించనున్నారు, బహిరంగ సభలో మాట్లాడనున్నారు.. దీంతో భద్రతా ఏర్పాట్లు చాలా పటిష్టంగా కొనసాగుతున్నాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బృందాలు విశాఖకు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.. దీంతో పాటు ప్రధాని పర్యటనకు 5 వేల మందికి పైగా పోలీసులను రంగంలోకి దించారట. ఇక, పీఎం మోడీ, సీఎం జగన్ పర్యటించుకున్న నేపథ్యంలో విశాఖ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. శనివారం ఏయు ఇంజనీరింగ్ మైదానాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక పోలీసు బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. మద్దిలపాలెం ఏయూ గేటు నుంచి వాహనాలు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.