భారత్‌ను ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా మార్చిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మోడీ ఏకతాటిపై నడిపిస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారని.. అందుకే ప్రజలు భారీ మెజార్టీ అందించారని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధికి మోడీ ఎంతగానో సహకరిస్తున్నారని… ఇందులో భాగంగానే ఈరోజు ఏపీకి రూ.2 లక్షల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. అభివృద్ధి అంటే ఏంటో ఎన్డీఏ ప్రభుత్వం చేసి చూపిస్తోందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
అంతకముందు సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఓపెన్ టాప్ వాహనం పైనుంచి ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పురందేశ్వరి ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు. దారి పొడవునా ప్రజలు పూల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.