Botsa Satyanarayana: వైసీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న దీక్షా శిబిరాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశంపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిర్వహిస్తున్న దీక్షా శిబిరంపై దాడి జరగడం అత్యంత దురదృష్టకరమని బొత్స అన్నారు. టెంట్లు ధ్వంసం చేయడంతో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, మహిళలపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారని ఆరోపించారు. దాడులను అడ్డుకోవాల్సిన పోలీసులు, బాధితులపైనే చర్యలు తీసుకుని మల్లాది విష్ణును అదుపులోకి తీసుకెళ్లారని విమర్శించారు.
మల్లాది విష్ణును పోలీస్ వ్యాన్‌లో తరలిస్తున్న సమయంలో పార్టీ జెండా కర్రతో దాడి జరిగిందని, దీక్షా శిబిరంలోని టెంట్‌పై మూత్ర విసర్జన చేసిన ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ శిబిరాలను పలుచోట్ల పోలీసులు తొలగించారని, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న నిరసనలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. డీఎస్సీ నియామకాలపై తమ పార్టీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందిపోయి, ఆందోళనలను అణచివేసే చర్యలకు పాల్పడుతోందని బొత్స విమర్శించారు. ఎన్ని దాడులు, దౌర్జన్యాలు జరిగినా తమ ఉద్యమం ఆగదని, డీఎస్సీ అక్రమాలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ..

