Simhachalam Incident: సింహాచలం దేవస్థానంలో జరిగిన దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. దుర్ఘటనపై తేల్చేందుకు ఎంక్వైరీ కమిషన్‌ను నియమించింది.. ఎంక్వైరీ కమిషన్ ఛైర్మన్ గా ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్, సభ్యులుగా ఐజీ ఆకే రవికృష్ణ, ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావును నియమించిన ప్రభుత్వం.. ఈ ఘటనపై 72 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.. ఇక, 30 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.. సింహాచలం అప్పన్న ఆలయంలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందిన విషయం విదితమే కాగా.. కమిషన్ కు అన్ని రకాల విచారణాధికారాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్..
Read Also: TGSRTC Strike: భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ సమ్మెపై పునరాలోచించాలి.. మంత్రి విజ్ఞప్తి
కాగా, సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకున్న విషయం విదితమే.. స్వామివారి నిజరూపా దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. సింహాచలంలో భారీ వర్షం కురవడం.. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది.. సింహాచలం వద్ద జరిగిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు సహా పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక, ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ప్రధాని మోడీ పరిహారం ప్రకటించిన విషయం విదితమే.