ఏపీలో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకుంటోంది. తాజాగా అమరావతి నుంచి ప్రారంభం అయిన ఉద్యమం విశాఖ సాగరతీరానికి చేరింది. విశాఖ జిల్లా స్ధాయిలోనూ ఉద్యోగ జేఏసీలు ఏకమయ్యాయి. పీఆర్సీ సాధన సమితిగా ఏర్పాటయినట్టు సమితి కన్వీనర్ ఈశ్వర్రావు తెలిపారు.
ఈనెల 25 న బైక్ ర్యాలీతో నగరమంతా నిరసన తెలుపుతామంటున్నారు. ఫిబ్రవరి 3 న ఛలో విజయవాడ తలపెట్టామన్నారు. తమ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లి వారి మద్దతు కూడగట్టుకుంటామన్నారు ఈశ్వరరావు. ఫిబ్రవరి 7 తేదీన మెరుపు సమ్మెకు దిగుతామన్నారు. అందుకు ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.
ఫిట్ మెంట్ సీఎం స్ధాయిలోనే పరిష్కారం కావాలి. ఉద్యోగుల ఆశల్ని జగన్ అడియాశలు చేశారు. ఐఆర్ 27 శాతం ఇస్తామని నమ్మించి జగన్ మోసం చేశారు. ఐఆర్ ఇచ్చినట్లే ఇచ్చి ఫిట్ మెంట్ 23 శాతానికి పరిమితం చేశారు. పెండింగ్ డిఏ కలిపి జీతాలు పెంచుతున్నామని చెప్పడం మోసపూరితం అని విమర్శించారు. అసుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బైట పెట్టాలని ఈశ్వరరావు డిమాండ్ చేశారు.