ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేత కొడాలి నాని, టీడీపీ నేత వంగవీటి రాధా ఇద్దరూ క్రేజ్ ఉన్న నేతలే. వేర్వేరు పార్టీలకు చెందిన వారైనా వీరిద్దరూ తమ స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. సాధారణంగా వైసీపీ, టీడీపీ నేతలు అనేక అంశాలపై ఆరోపణలు చేసుకోవడం మాములే. కొడాలి నాని నిత్యం చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తూనే ఉంటారు కూడా. ప్రతిగా టీడీపీ నేతలు కూడా కొడాలి నానిని టార్గెట్ చేస్తుంటారు. కానీ కొడాలి నాని, రాధా అనుబంధంపై ఈ మాటల యుద్ధం ప్రభావం ఉన్నట్లే కనిపించదు.
తాజాగా గుడివాడలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా వెంకట రమణ (బాబ్జి) అంతిమయాత్రలో మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా పాల్గొన్నారు. బాబ్జి ఆకస్మిక మృతి పట్ల నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారిద్దరూ అతి సాధారణంగా ఓ ఆటోలో కూర్చుని టీ తాగుతూ కనిపించారు. కొంతకాలంగా కొడాలి నాని తన స్నేహితుడు రాధాను వైసీపీలోకి తీసుకురావాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ కార్యరూపం దాల్చలేదు. అయితే కొడాలి నానితో ఉన్నంత సన్నిహితంగా వంగవీటి రాధా టీడీపీ నేతలతో ఉండరని పలువురు కామెంట్ చేస్తున్నారు.
