ఈ సృష్టి విచిత్రం. బద్ధ శత్రువులు కూడా కలిసిపోతుంటారు. జంతువులు కూడా తమ జాతి వైరాన్ని మరిచి పోతుంటాయి. కుక్క-కోతి, పిల్లి-కుక్క, కుక్క-కోడి ఇలా అనేకం కలిసి మెలిసి జీవిస్తుంటాయి. అలాంటిదే ఇది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోట గ్రామంలోని గోమాత మేక పిల్లకు తల్లిగా ప్రేమను పంచి పెడుతోంది. తల్లి లేని మేక పిల్లకు గోమాత పాలిచ్చి లాలిస్తూ అక్కున చేర్చుకుంది. బతకల సవరయ్యకు చెందిన మేక పది రోజుల క్రిందట మేక పిల్లకు జన్మనిచ్చింది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి మేక మృతి చెందడంతో మేకపిల్ల ఒంటరైంది.
తల్లి ఆలన లేక, పాలు పట్టేవారు లేక ఆకలితో అలమటిస్తున్న మేక పిల్ల పశువుల శాలలో ఉన్న ఆవు దగ్గరకు వెళ్లి లేగ దూడతో కలిసి పాలు తాగుతూ ఆకలిని తీర్చుకుంది. గోమాత కూడా జాతి భేదాన్ని ప్రక్కన పెట్టి తల్లిలా ఆదరించింది. అక్కున చేర్చుకుని ఆకలి బాధ తీర్చింది. రోజూపాలు పెడుతూ తల్లిలేని లోటు తీర్చి మేక పిల్లకు ప్రాణం పోస్తోంది. ఈ అపురూప దృశ్యం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆవు పాలు తాగుతున్న మేక పిల్లను చూసేందుకు జంతు ప్రేమికులు , పరిసర గ్రామాల ప్రజలు రెంటికోటకు క్యూ కడుతున్నారు.