Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి కొత్త మోటర్ వెహికిల్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఇక, నూతన మోటార్ వాహన చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై విజయవాడ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి గల్లీలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి.. రూల్స్ పాటించని వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఈక్రమంలోనే బెజవాడ పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. ఓ వాహనదారుడు ట్రాఫిక్ సీఐ రామారావుతో వితండ వాదానికి దిగాడు. పోలీసులు తమ ఐడీ చూపించాలంటూ అతడు హల్చల్ చేశాడు.. నకిలీ పోలీసులు తిరుగుతున్నారంటూ నానా హంగామా సృష్టించాడు. దీంతో చివరకు తన ఐడీ కార్డు చూపించిన సీఐ రామారావు సదరు వాహనదారుడికి హెల్మెట్ లేకపోవడంతో ఫైన్ వేశాడు.
Read Also: Shamshabad Air Port: ప్రయాణికుల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఔట్ పోస్ట్..
అయితే, బెజవాడ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఫేక్ పోలీసులు ఎవరూ ఉండరు.. ఐడీ కార్డు చూపించేందుకు పోలీసులు రెడీ అని తెలిపారు. అంతేకానీ, అనవసర వాగ్వాదానికి దిగొద్దు అని హెచ్చరించారు. పోలీసు యూనిఫామ్‌పై.. ఎవరూ ఏంటి అన్నది క్లియర్‌గా కనిపిస్తుంది అని పేర్కొన్నారు. పోలీసులకు వాహనదారులు అందరూ సహరించాలి అని సూచించారు. ఐడీ కార్డు చూపించేందుకు అభ్యంతరం లేదు.. కానీ, విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదం వద్దు అని ఏపీ పోలీస్ అధికారులు వెల్లడించారు. ఇక, ప్రస్తుతం 75 శాతం ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటిస్తున్నారని, మిగిలిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుని, నిబంధనలను పాటించేలా చేస్తామని ట్రాఫిక్ అడిషనల్ ఏసీపీ ప్రసన్న తెలిపారు.