Prakasam Barrage: కృష్ణాలో నీళ్లు ఎగదన్నితే.. నరకం ఎలా ఉంటుందో బెజవాడ వాసుల ప్రత్యక్షంగా చూస్తున్నారు.. కన్నీటి బాధలను అనుభవిస్తున్నారు. కృష్ణానది, మున్నేరువాగు, బుడమేరు.. ఒకేసారి ఉగ్రరూపం దాల్చడంతో.. బెజవాడ మొత్తం మునిగిపోయింది. ప్రజలు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. శాంతించమ్మా కృష్ణమ్మా అంటూ.. వరద నీటిలోనే వేడుకుంటున్నారు. సాగర్ కింద వచ్చే వరద.. కృష్ణానదికి ఇబ్బందికరంగా మారుతోంది. అమావాస్య కారణంగా.. కృష్ణాలోకి నీళ్లు పోవడం లేదు.. వెనక్కి వచ్చేస్తున్నాయి. దీంతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అన్నమో రామచంద్రా అంటూ వేడుకుంటున్నారు. కాపాడండి మహాప్రభో అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే.. బెజవాడ వాసులు క్రమంగా ఊపిరి పీల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ప్రకాశం బ్యారేజీకి గంట గంటకూ వరద తగ్గుతోంది.. మధ్యాహ్నం 3 గంటల నుంచి క్రమంగా వరద తగ్గుతోంది.. మధ్యాహ్నం 12 గంటలకు రికార్డ్ స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి 11.43 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. రాత్రి 9 గంటల వరకు ప్రకాశం బ్యారేజీకి 11.20 లక్షల క్యూసెక్కులకు తగ్గింది ఇన్‌ఫ్లో.. ఇక, క్రమంగా వరద మరింత తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.. బుడమేరుకూ ప్రస్తుతం ఇన్‌ఫ్లో నాలుగు వేల క్యూసెక్కుల మాత్రమే ఉంటుందంటున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు..
కాగా, బుడమేరు వాగులో భారీగా వరదనీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలకు వరద ఉధృతి పెరిగిన విషయం విదితమే.. దీంతో దిగువన ఉన్న నివాస వీధుల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. అనేక మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం పుట్టగుంట వద్ద ప్రమాద భరితంగా ప్రవహిస్తోంది. వంతెనకు నాలుగు అడుగుల మేర నీటి ప్రవాహం ఉంది. అధికారుల ఆదేశాలతో గుడివాడ హనుమాన్ జంక్షన్ రహదారిని పోలీసులు మూసివేశారు. మరోవైపు అంబాపురంపైన ఉన్న పాములు కాలువ, వాగులేరు కట్టలు తెగాయి. ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. పరివాహక గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ప్రమాదకర స్థాయిలో పెనుగంచిప్రోలు చెరువు ప్రవహిస్తోంది. లింగాల, పెనుగంచిప్రోలు వంతెనలపై ప్రమాద స్థాయిలో వరద చేరింది. ఈ క్రమంలోనే తిరుపతమ్మ ఆలయాన్ని వరద చుట్టుముట్టడంతో పాటు దుకాణాల్లోకి చేరింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. రహదారులపై గుంతలు పడటంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
బెజవాడ దుఃఖదాయని బుడమేరు నగరంపై విరుచుకుపడింది. అతి భారీ వర్షాలకు తోడు బుడమేరు పొంగడంతో బెజవాడ నగరవాసులు వణికిపోయారు.. బుడమేరుకు నీటిప్రవాహం పెరిగి వరద పోటెత్తింది. విజయవాడ పశ్చిమ, మధ్య నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. రెండురోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు నగరం నీట మునిగింది. బుడమేరు పొంగడంతో పరిస్థితి మరింత దిగజారింది. దాదాపు 3 లక్షల మంది ఆహారం, తాగునీరు లేక అల్లాడుతున్నారు. వారి ఇళ్లన్నీ ఆరడుగుల మేర నీటిలో మునిగాయి. బుడమేరు ముంపు సమస్య ఇప్పటిది కాదు. దీన్ని నిర్లక్ష్యం చేసిన పాపం ఇప్పుడు నగరాన్ని ముంచెత్తింది అంటున్నారు.. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు విజయవాడ నగరం చిగురుటాకులా వణుకుతోంది. ఎక్కడికక్కడ నిలిచిన వరదతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలోని సింగ్నగర్, కానూరులోని కల్పన నగర్, మాణిక్యనగర్, సనత్‌నగర్‌తోపాటు పలు కాలనీల్లోని రహదారులు తటాకాల్లా మారాయి. మురుగుకాల్వల వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రాంతమంతా జలదిగ్బంధమైంది. ఏరు-దారి ఏకమైపోవడంతో ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. అయితే, ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో తగ్గడంతో ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు బెజవాడ ప్రజలు.. మరోవైపు.. విజయవాడ-హైదరాబాద్ హైవేపై సైతం నీటి ప్రవాహం తగ్గడంతో.. ఏపీ-తెలంగాణ మధ్య రాకపోకలు తిరిగి ప్రారంభించారు.. అయితే, హైవేపై బురద పేరుకుపోవడంతో.. నిదానంగా వాహనాలను పంపిస్తున్నారు.