విజయవాడ.. గత కొద్దినెలలుగా గంజాయికి అడ్డాగా మారుతోందా? నేరస్తులు గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ కి బెజవాడను సేఫ్ ప్లేస్ గా భావిస్తున్నారా? భారీగా పాటుపడుతున్న గంజాయి వెనుక ఎవరున్నారు? గంజాయి అమ్మకాలు,కొనుగోళ్లపై టాస్క్ ఫోర్స్ ఉక్కు పాదం మోపుతున్న మళ్ళీ అలాంటి ఘటనలే చోటుచేసుకోవడం దేనికి సంకేతం. ఏపీ, ఒడిశా సరిహద్దులోని ఏజెన్సీ ఏరియాల నుండి కార్ డోర్స్ లో పెట్టి కేజీల కొద్దీ గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు కేటుగాళ్ళు. పైగా వారు పుష్ప సినిమా తరహాలో నయా ఐడియాతో పోలీసులకు మస్కా కొట్టిస్తున్నారు.
నెల క్రితం పాడేరు నుండి ఛత్తీస్ ఘడ్ వెళ్తున్న 80 కేజీల గంజాయి వాహనాన్ని బెజవాడలో సీజ్ చేశారు పోలీసులు. ఎన్టీవీ తో టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాస్ మాట్లాడారు. ఆరునెలల్లో 300 కేజీల గంజాయిని సీజ్ చేసాం అన్నారు.
గంజాయి కట్టడికి నాలుగు స్పెషల్ టీమ్స్ సిటీలో జల్లెడ పడుతున్నాయన్నారు. కాలేజీ విద్యార్థుల కేంద్రంగా గంజాయి అమ్మకాలు,కొనుగోళ్లు నడుస్తున్నాయని శ్రీనివాస్ వెల్లడించారు. చిన్న చిన్న పనులు చేసుకునే వారు సైతం గంజాయికి అలవాటు పడుతున్నారు. పట్టుబడ్డ వారికి, వారి తల్లి తండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాం అన్నారు. గంజాయితో పదే పదే పట్టుపడితే సహించం అని ఆయన హెచ్చరించారు.\
ఇదిలా వుంటే ఏపీలో ఎక్కడో చోట గంజాయి గుప్పుమంటూనే వుంది. బుధవారం తూర్పుగోదావరి జిల్లా గోకవరం గంగాలమ్మ గుడి సమీపంలో అక్రమంగా రవాణా చేస్తున్న 126 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుడి సమీపంలో వాహన తనిఖీలు చేసే నేపథ్యంలో రంపచోడవరం నుంచి కోరుకొండ వైపుగా వస్తున్న కారును పోలీసులు ఆపారు. అయితే కారు డ్రైవరు ఆపకుండా అతి వేగంగా వెళ్లి రాళ్ల గుట్టను ఢీకొట్టి కారును వదిలి పరారయ్యాడు. పోలీసులు కారును పరిశీలించగా ఐదు ప్లాస్టిక్ సంచులను గుర్తించారు.అందులో 126 కేజీల గంజాయి ఉన్నట్టు తెలిపారు. దీని విలువ రూ.2.52 లక్షల వరకూ ఉంటుందని అంచనా వేశారు. గంజాయిని, కారును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.
Read Also: Supreme Court: నేడు సుప్రీం కోర్టు ముందుకు హై ప్రొఫైల్ కేసులు..