మద్యం మత్తులో నడిరోడ్డుపై యువతితో ఓ కానిస్టేబుల్ గొడవ పడిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. గొడవ అడ్డుకునేందుకు మరో కానిస్టేబుల్ ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఇద్దరు ఒకరి నొకరు చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడ ఫోర్త్ ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస నాయక్ తాగిన మైకంలో ఓ యువతితో గొడవపడ్డాడు. యూనిఫాంలో ఉండి ఫుల్ గా మద్యం సేవించాడు. అంతే కాకుండా యువతితో గొడవకు దిగాడు. శ్రీనివాస నాయక్, మహిళ మధ్య గొడవలో జోక్యం చేసుకున్నాడు విజయవాడ అజిత్ సింగ్ నగర్ బీటు కానిస్టేబుల్ కోటేశ్వరరావు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై శ్రీనివాస నాయక్ , కోటేశ్వరరావు చొక్కాలు పట్టుకుని గొడవ పడ్డారు.
దీంతో ఈ విషయం కమిషనర్ వరకు వెళ్లింది. కానిస్టేబుల్స్ శ్రీనివాస నాయక్ , కోటేశ్వరరావుల పై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఇద్దరిని సస్పెండ్ చేశారు కమిషనర్ రాజశేఖర్ బాబు. కానీ ఇద్దరిని కాకుండా మద్యం తాగి యువతితో గొడవకు దిగిన శ్రీనివాస నాయక్ ను మాత్రమే సస్పెండ్ చేస్తే.. బాగుండేదని.. కోటేశ్వరరావు గొడవ ఆపేందుకు వెళ్లడంతో అతడిపై వేటు పడిందంటున్నారు జనాలు.