టీడీపీ పార్టీ పై మరోసారి వైసీపీ నేత, రాజ్య సభ్యులు విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు ఉన్మాదుల్లా, ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని… రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దొంగల ముఠాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదన్నారు. అందుకే టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్ ను కోరామని స్పష్టం చేశారు విజయ సాయిరెడ్డి.
అసభ్య పదజాలంతో దూషిస్తున్న టీడీపీ నేతలు నారా లోకేష్, పట్టాభి, దేవినేని ఉమ, బోండా ఉమ, అయ్యన్నలపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరు వాడుతున్న పదజాలం గురించి తెలుసుకున్న ఎలక్షన్ కమిషనర్లే ఆశ్చర్యపోయారని… ఇలాంటి వారిని ఎన్నికల ప్రక్రియ నుంచి బహిష్కరించాలని పేర్కొన్నారు.
ఏపీలో పరిస్థితులను ఆరా తీసేందుకు బాబుకు అమిత్ షా ఫోన్ చేశారని టీడీపీ ప్రచారం చేసుకోవడం జోక్ ఆఫ్ ద డికేడ్ అని ఎద్దేవా చేశారు. అవసరాన్ని బట్టి గవర్నర్ హోం శాఖకు నివేదికలు పంపిస్తారని… ప్రత్యేక సమాచారం కావాలంటే సీఎస్ ను పిలిపిస్తారన్నారు. ఫోన్లలో ప్రైవేటు వ్యక్తులను అడగరని… ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అంటూ విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.