వ్యవసాయ రంగంలో సాంకేతిక పెగాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఐవీ సుబ్బారావు రైతు నేస్తం అవార్డు ఫంక్షన్‌లో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జనాకర్షణ పథకాలకు ప్రభుత్వాలు అధికంగా డబ్బు ఖర్చు పెట్టవద్దన్నారు. రైతుకు కావాల్సింది క్వాలిటీ ఉన్న విద్యుత్ పది నుంచి 12 గంటలు ఇవ్వాలన్నారు. రైతు పరపతి వడ్డీ రేట్లు ఇంకా తగ్గించాలన్నారు. ఉచితాలతో, తాత్కాలిక జనాకర్షణ పథకాలతో మేలు ఎవ్వరికి జరగదన్నారు. అందరికీ తెల్ల రేషను కార్డు ఉందా..ఉచితంగా ఇస్తే… మధ్యాహ్నం మట్ట గుడిసె ఇస్తే సాయంత్రం కొరమీను కావాలంటారని వెంకయ్యనాయుడు అన్నారు.
దేశ వ్యాప్తంగా స్వేచ్ఛా మార్కెట్ ఉండాలి.. ఇక్కడే అమ్మండి, అక్కడే అమ్మండి అని మనమెవరు చెప్పడానికి, చదువుకున్న ప్రతీ ఒక్కరికీ ఉద్యోగాలొస్తాయా..? ఇస్తామన్న ప్రభుత్వం ఇస్తుందా..? ఆలోచనలో మార్పు రావాలని యువతను ఉద్దేశించి వెంకయ్యనాయుడు అన్నారు.చదువుకున్న యువత గ్రామాలకు వెళ్ళాలి, బ్యాక్ టూ విలేజెస్ అని సాంకేతికతకు ప్రైవేటు రంగం సహకరించాలన్నారు. పట్టభద్రులైన యువత తమ పేరుపక్కన ఫార్మర్ అని రాసుకునేందుకు గర్వించే పరిస్ధితి రావాలి.కరోనా కాలంలో ముందువరుస పోరాట యోధులుగా రైతులు పని చేశారు. వ్యవసాయ ఉత్పత్తిని మొక్కవోని దీక్షతో పెంచారు. కృషిని గుర్తించారనే సంతృప్తితో ఈ అవార్డులు ఇస్తున్నట్టు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
ప్రపంచంలో వ్యవసాయ శాస్త్రీయ విధానాలు ప్రవేశపెట్టిన ఘనత భారతీయులదేనని ఆయన చెప్పారు. మట్టిలోని సారాన్ని మానవ మనుగడకు వినియోగించేదే వ్యవసాయమని తెలిపారు. త్వరలో పట్టణాల్లో ఆర్గానిక్ స్టోర్స్ వస్తున్నాయన్నారు.పర్యావరణాన్ని కాపాడు కుంటేనే రుతువులు గతి తప్పకుండా ఉంటాయి. అనేక రకాల పర్యావరణ మార్పుల కారణంగా రైతు దెబ్బ తింటున్నాడు. పాశ్చాత్య పోకడలతో జంక్ ఫుడ్ కు వెళ్తున్నారు. జంక్ ఫుడ్ మన దేశ వాతావరణానికి పని చేయదు.ఆరోగ్యకరమైన ఆహారం పేరిట మన ఆహారపు అలవాట్లను ప్రపంచం మొత్తం అనుసరిస్తుంది. మనమే పాశ్చత్య ఫుడ్ వైపు వెళుతున్నాం.
కోవిడ్ ప్రమాదం ఇంకా పోలేదు
కోవిడ్ ఎక్కువగా పల్లెల్లో వస్తోంది. ప్రమాదం ఇంకా పొంచి ఉంది. అందరూ కోవిడ్ జాగ్రత్తలను పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అధునాతన పరిజ్ఞానం ఉందని చెప్పే దేశాల్లోనే కోవిడ్ ఎక్కువగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో సవాళ్ళు ఎక్కువ కనుక సహాయం కూడా పెంచాలి. పంటల భీమా పథకాలు మరింత పటిష్టంగా అమలుచేయాలి. రైతుకు ఎప్పటికప్పుడు అప్డేట్ అందించేలా అన్ని భాషల్లో సమాచారం ఉండాలని వెంకయ్య నాయడు అన్నారు.