రేపల్లె ఘటన బాధితురాలిని ఒంగోలు రిమ్స్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పరామర్శించారు. బాధితురాలికి టీడీపీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కనుమరుగయ్యాయన్నారు. అవగాహన లేని వ్యక్తి సీఎం కావడంతో ఇలాంటి పరిస్థితి ఉందని, రాష్ట్రంలో మహిళలు పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేని కారణంగానే రేపల్లె లాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయన్నారు. బాధితురాలు భయంతో ఇప్పటికీ వణికి పోతుందని, వైసీపీ ప్రభుత్వం ముద్దాయిలతో స్నేహంగా ఉంటుందని, రాష్ట్రంలో రోజుకి మూడు మాన భంగాలు, ఆరు హత్యలు జరుగుతున్నాయని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.
శాంతి భద్రతల విఘాతం, ప్రభుత్వ ఘోర వైఫల్యం అంటూ ఆయన ధ్వజమెత్తారు. హోంమంత్రి పదవికి తానేటి వనిత రాజీనామా చేసి మరో మంత్రి పదవి తీసుకోవాలని, దళిత మహిళల గురించి మాట్లాడేటప్పుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్నారు. మంత్రి పదవి పోయినా బాలినేని శ్రీనివాసరెడ్డికి పొగరు తగ్గలేదంటూ మండిపడ్డారు. బాలినేని ఇప్పుడు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యే మాత్రమేనని, బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం మొత్తం బయటకు తీస్తామని విమర్శించారు.