విజయవాడ 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో వంగవీటి రంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు వంగవీటి రాధా. దీంతో శ్రీనగర్ కాలనీకి పెద్దఎత్తున చేరుకున్నారు వంగవీటి రంగా, రాధా అభిమానులు. భారీ ర్యాలీతో, బాణా సంచాతో రాధాకు స్వాగతం పలికారు అభిమానులు. కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు. నా తండ్రిని కులమతాలకతీతంగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. శ్రీనగర్ కాలనీలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు.రాష్ట్రం నలుమూలలా రంగా గారి పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు. రంగా అంటే పోరాటానికి దిక్సూచి, పేదల పాలిట పెన్నిధి అన్నారు వంగవీటి రాధాకృష్ణ.
రంగా కొడుకుగా ఎవ్వర్ని అభ్యర్ధించను.. జిల్లాకు రంగా పేరు పెడితే ఆనందిస్తాను. రంగా ఒక్క జిల్లాకే పరిమితం కాదు.. రాష్ట్రం మొత్తం ఆరాధిస్తుందన్నారు. రంగా చరిత్ర గురించి ప్రత్యేకంగా ఎవరూ చెప్పనక్కర్లేదు. రంగా అభిమానులంతా ఏకమైతే ప్రభుత్వాలే కూలిపోవడం ఖాయం. రంగా శిష్యులు, అభిమానులు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వారు కూడా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టేలా కృషి చేయాలని కోరారు. ఏ పదవి, హోదా ఇవ్వని గౌరవం నాకు రంగా అబ్బాయిగా దక్కింది. పదవులు ఐదేళ్లకు మారిపోవచ్చు. రంగా కొడుకుగా ప్రజలు చూపించే అభిమానం అనంతం అని ఉద్వేగానికి గురయ్యారు రాధాకృష్ణ. ఈ జన్మకు రంగా కొడుకనే అదరణే నాకు సంతృప్తి అన్నారు వంగవీటి రాధా.
జనసేన నేత పోతిన మహేష్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా పేరు చెప్పుకోకుండా రాజకీయాలు చేయలేరు.ఏ పార్టీ అయినా, ఏ సామాజిక వర్గమైనా రంగా పేరు చెప్పుకునే పరిస్థితి.వంగవీటి మోహనరంగా కుల, మతాలకతీతంగా పేదల కోసం అండగా నిలిచారు.ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక నాయకుడు వంగవీటి మోహనరంగా.రంగా తనయుడిగా రాధాకృష్ణ తండ్రి ఆశయాల కోసం పని చేస్తున్నారు.గుండె నిండా అభిమానం నింపుకున్న వారంతా రాధా అడుగు జాడల్లో నిలవాలి.రాధాకృష్ణ ఎమ్మెల్యే కావడమే కాక, రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని ప్రజలు కోరుకుంటున్నారు. జిల్లాల పునర్విభజన నేపధ్యంలో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలి.
రాధా రంగ మిత్ర మండలి అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా చనిపోయిన తర్వాత కోట్ల మంది అభిమానులు కన్నీళ్లు పెట్టారన్నారు. రంగా ఒక శక్తి.. అందుకే ఊరు వాడా స్వచ్ఛందంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రంగాను చూడని నేటి తరం కూడా ఆరాధించడం గొప్ప విషయం. ఈ జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని లక్షలాది మంది కోరుతున్నారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నాం అన్నారు.