ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం గన్నవరం పంచాయతీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో గన్నవరం పంచాయతీపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ స్పందించారు. సీఎం కార్యాలయం నుంచి పిలుపు వస్తే తాను వెళ్లానని.. అయితే సీఎం జగన్ వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో మళ్ళీ కలుద్దామని చెప్పారని వివరించారు. సీఎంవో అధికారులు తననేమీ వివరాలు అడగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి గన్నవరం అభ్యర్థిని తానేనని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎటువంటి విచారణ అయినా చేసుకోవచ్చన్నారు. ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో తనకు తెలియదన్నారు.
తన మీద ఆరోపణలపై విచారణ కోసం సీబీఐ, ఐక్యరాజ్యసమితికి కూడా లేఖలు రాసుకోవచ్చని.. అందులో తప్పేమీ లేదని విమర్శకులకు వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. అర్ధం లేని ఆరోపణలపై తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. మూడుసార్లు ఎన్నికలను ఎదుర్కొన్నానని.. ఏ ఊర్లో ఎవరితో పని చేయించుకోవాలో తనకు బాగా తెలుసని వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. తాను ఎవరి దగ్గరా కోచింగ్ క్లాస్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తన నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటున్నానని.. కొంతమంది మీడియాలో కనిపించాలనే మోజుతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను వైసీపీలో చేరక ముందే ఇళ్ల పట్టాలకు సంబంధించి భూ సేకరణ జరిగిందని.. తన నియోజకవర్గంలో ఎక్కడా అక్రమ క్వారీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు లేవని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు.