Ushashri Charan Fires On Chandrababu Naidu: టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి ఉష శ్రీ చరణ్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలను నిలువునా మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు దిగిపోయే సమయంలో 80 వేల సంఘాలే ఉండేవని, జగన్ వచ్చాక రెండు లక్షలకు పైగా సంఘాలు వచ్చాయని అన్నారు. డ్వాక్రా మహిళల కష్టాలు చూశాక నాలుగు దఫాలుగా నగదు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని సంఘాలు కూడా ప్రగతిబాటలో నడుస్తున్నాయని చెప్పారు. డ్వాక్రా మహిళలను ఎవ్వరు బెదిరించడం లేదని, ఏ పథకం తీసుకున్నా మహిళలకే 50 శాతం వెళ్తున్నాయని స్పష్టం చేశారు. మహిళలు ఎక్కువగా తమ సభలకే వస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు.
రాజకీయంగా మహిళలకు మంచి ప్రాధాన్యత ఉందని, మంచి అవకాశాలు వస్తున్నాయని ఉష శ్రీ పేర్కొన్నారు. మహిళల ఖాతాల్లో పథకాల డబ్బులు నేరుగా పడుతున్నాయని, అందుకే సీఎం జగన్‌ను చూడటానికి మహిళలు సభలకు ఎక్కువగా వస్తున్నారన్నారు. అయితే.. సభలకు వచ్చే మహిళలపై అనవసర రాతలు రాసి, దుష్ప్రచారం చేయటం కరెక్ట్ కాదని హితవు పలికారు. మహిళలపై చంద్రబాబు హయాంలో ఎన్ని దాడులు జరిగాయో అందరూ చూశామని.. రిషితేశ్వరి, వనజాక్షి లాంటి వారిపై ఆకృత్యాలు టీడీపీ హయాంలోనే ఎన్నో వెలుగు చూశాయని అన్నారు. కానీ జగన్ హయాంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. 30 లక్షల మంది మహిళల పేరు మీద ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. మహిళలకు నిజమైన స్వావలంబన జగన్ పాలనలోనే దక్కిందని.. రాజకీయంగా కూడా అనేక పదవులు దక్కాయని వెల్లడించారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఎల్లో మీడియా ఈ 16 నెలలు ఇంకా అధికంగా విషం చిమ్మేలా వార్తలు రాస్తారని ఉష శ్రీ ఆరోపణలు చేశారు. కానీ.. వాటిని జనం నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబును మహిళలు నమ్మరని, అందుకే ఇలాంటి వార్తలని ఆయన నమ్ముకున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహిళలందరూ దుర్గమ్మ అవతారం ఎత్తితే.. ఈ టీడీపీ నేతలను రాజకీయ సంహారం చేయటం ఖాయమని హెచ్చరించారు.