AP High Court Shifting to Kurnool: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులు తమ విధానం అని స్పష్టం చేసింది.. విశాఖ పరిపాలన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని పేర్కొంది.. అందులో భాగంగా త్వరలోనే విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ మధ్యే మంత్రులకు తెలిపారు.. ఇక, కర్నూలుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు.. ఏపీ హైకోర్టు కర్నూలుకు తరలింపు వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందని తెలిపారు.
Read Also: Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన.. ప్రస్తుతానికి ఎత్తు అంతే..!
హైకోర్టును కర్నూలుకు తరలింపు అంశం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు కిరణ్ రిజిజు.. ఇక, హైకోర్టు నిర్వహణ వ్యయం రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతని పేర్కొన్నారు.. అదేవిధంగా హైకోర్టు రోజువారి పాలన వ్యవహారాల బాధ్యత అంతా సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిదే అన్నారు.. కర్నూలుకు హైకోర్టు
తరలింపుపై ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 214 నిబంధన ప్రకారం 2018లో కేంద్రం వర్సెస్ దన్ గోపాల్ రావు, ఇతరుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటు అయిందని ఈ సందర్భంగా తెలిపారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉమ్మడి హైకోర్టుగా ఉన్న అప్పటి హైదరాబాద్ హైకోర్టు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు అయినట్టు అయ్యింది.. ఇప్పుడు కర్నూలు తరలించే విషయంలో హైకోర్టు ప్రధాని న్యాయమూర్తి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాలని క్లారిటీ ఇచ్చారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు.