ఇటీవల అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున సత్తా చాటిన తెలుగు కుర్రాడు షేక్ రషీద్ బుధవారం నాడు ఏపీ సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా షేక్ రషీద్‌ను సీఎం జగన్ అభినందించారు. షేక్ రషీద్ మరింత మెరుగ్గా ఆడేందుకు అతడికి ప్రోత్సాహకాలను ప్రకటించారు. షేక్ రషీద్‌కు గుంటూరులో ఇంటి స్థలం, రూ.10 లక్షల నగదుతో పాటు గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
కాగా ఏపీలో క్రీడాకారులను సీఎం జగన్ ఎంతో ప్రోత్సహిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. షేక్ రషీద్ గుంటూరు జిల్లా వాసి అని.. అతడికి ఎలాంటి సహకారం కావాలన్నా ఇవ్వాలని సూచించారన్నారు. రూ.10 లక్షల చెక్‌ను వెంటనే సీఎం అందించారన్నారు. అటు షేక్ రషీద్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. సీఎం జగన్ తనతో బాగా మాట్లాడారని.. బాగా ఆడమని ప్రోత్సహించారని తెలిపాడు. సీఎం తనకు ఆల్ ది బెస్ట్ చెప్పారని పేర్కొన్నాడు. భవిష్యత్‌లో మరింత బాగా ఆడి రాష్ట్రానికి పేరు తీసుకువస్తానని షేక్ రషీద్ ధీమా వ్యక్తం చేశాడు. తనకు ప్రోత్సాహకాలను ప్రకటించిన సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశాడు. తనకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టమన్నాడు. ఇంట్లో అందరూ తనకు మద్దతిచ్చేవారని… సచిన్ ఆటను చూస్తూ పెరిగానని, అతడి ఆట తనకు స్ఫూర్తి అని వెల్లడించాడు. కోహ్లీ, లక్ష్మణ్, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు తనకు విలువైన సూచనలు ఇచ్చారని.. భవిష్యత్‌లో టీమిండియాకు ఆడాలన్నదే తన లక్ష్యమని షేక్ రషీద్ చెప్పుకొచ్చాడు.