Vijayawada: సాధారణంగా ఎవరైనా మోసం చేస్తే పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ పోలీసులే మోసం చేస్తే ఎవరికి చెప్పాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? తాజాగా విజయవాడలో పోలీసులే నిరుద్యోగులకు టోకరా పెట్టారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సుబ్బారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సురేష్ హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షలు వసూలు చేశారు. అయితే ఇదంతా 2020లో చోటు చేసుకుంది. వన్‌టౌన్ పోలీస్ క్వార్టర్స్ వద్ద హెడ్ కానిస్టేబుల్ సురేష్‌కు బాధితులు పలు దఫాలుగా డబ్బులు చెల్లించారు. కానీ ఉద్యోగాలు మాత్రం ఇప్పించలేదు.
Read Also: Police Vehicle: అరే ఏంట్రా ఇది.. ఫిర్యాదును నిరాకరించారని పోలీసు వాహనాన్నే..
అయితే అప్పటి నుంచి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వలేదు. రెండు సంవత్సరాలు దాటిపోయినా ఉద్యోగాలు రాకపోవటంతో బాధితులు కానిస్టేబుళ్లను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రేడియో మెసేజ్ పేరుతో కానిస్టేబుళ్లు ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్స్ సృష్టించారు. చివరకు ఇవి ఫేక్ అపాయింట్‌మెంట్ అని బాధితులు తెలుసుకున్నారు. డబ్బులు తిరిగి ఇమ్మంటే అక్రమ కేసులు పెడతామంటూ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ బెదిరిస్తున్నారని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుళ్ల బెదిరింపులతో కొందరు బాధితులు పోలీస్ కేసు పెట్టేందుకు ముందుకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఈ అంశంపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా కానిస్టేబుల్ సుబ్బారెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.