TTD EO Dharma Reddy: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. 10 ఎకరాల స్థలంలో కరీంనగర్‌లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టుకు ఇచ్చే విరాళాలతో వెనుకబడిన ప్రాంతాలలో ఆలయాలు నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ చేస్తున్నామని తెలిపారు. లక్ష రూపాయల కంటే తక్కువ విరాళం ఇచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శన సౌకర్యం కల్పిస్తున్నామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు.శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ల విధానంతో దళారీ వ్యవస్థను అరికట్టగలిగామని పేర్కొన్నారు. పది రోజులలో 6.09 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తే హుందడీ ద్వారా 39.4 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని ధర్మారెడ్డి తెలిపారు.
Read Also: Mudragada: సీఎం జగన్‌కు మరోసారి ముద్రగడ పద్మనాభం లేఖ.. ఏం రాశారంటే..?
శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితుల దృష్యా రోజుకు 70 వేల మంది భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించవచ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. గత ఏడాది 2.37 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే.. హుండీ ద్వారా రూ. 1450 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 11.54 కోట్ల లడ్డు ప్రసాదాలు విక్రయించామని, 4.77 కోట్ల మంది భక్తులకు అన్నప్రసాద సౌకర్యం కల్పించామని, 1.09 కోట్ల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని ఈవో వెల్లడించారు. ఈనెల 28వ తేదీన రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో సమయం మార్పు విధానాన్ని మరో రెండు నెలలు పాటు పొడిగించే అంశాన్ని పరిశీలన చేస్తామన్నారు.