ఏడుకొండల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే.. కోవిడ్ కారణం గత రెండు సంవత్సరాలు పూర్తిస్థాయిలో శ్రీవారి దర్శనాలు ప్రారంభించలేదు. అయితే ఇటీవల పూర్తిస్థాయిలో దర్శనాలకు అనుమతించడంతో తిరుమలకు భక్తులు తాకిడి పెరిగింది. అయితే స్వామి వారి దర్శనానికి గంటల సమయం పడుతుండడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం భక్తులకు ఇకపై ఎలాంటి నిరీక్షణ లేకుండా గంటరన్న వ్యవధిలోనే దర్శన సౌకర్యం కల్పించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
రద్దీకి అనుగుణంగా సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్టు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రొటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలను తీసుకోవడం లేదని చెప్పారు ఈవో ధర్మారెడ్డి. శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన నిధులతో 150 కొత్త ఆలయాలను నిర్మించనున్నట్టు చెప్పారు. అలాగే, దాదాపు 100 పురాతన ఆలయాలకు నిధులు కేటాయించినట్టు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.