Tirumala Tirupati Devastanam: తిరుమలలో ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందజేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే అన్నదానం పేరుతో పలువురు భక్తులు భారీ స్థాయిలో విరాళాలను అందజేస్తున్నారు. కానీ కొందరు ప్రైవేట్ సంస్థలకు విరాళాలు అందిస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక ప్రకటన చేసింది. అన్నదానం పేరు చెప్పే ప్రైవేటు సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దని భక్తులకు స్పష్టం చేసింది. సికింద్రాబాద్ అనంత గోవిందదాస ట్రస్టుకు, తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ స్పష్టం చేసింది. అక్రమంగా విరాళాలు సేకరించే ట్రస్టులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని టీటీడీ హెచ్చరించింది.
Read Also: Vijaya Sai Reddy: ఆర్.ఆర్.ఆర్ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ సాధిస్తుంది..!!
మరోవైపు తిరుమల కొండ నుంచి ఇతర ప్రాంతాలకు టీటీడీ విద్యుత్ బస్సులు ప్రవేశపెడుతోంది. ఈ బస్సులను సీఎం జగన్ ఈ నెల 27న బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రారంభించనున్నారు. ఈ బస్సులు ఇప్పటికే అలిపిరి డిపోకు చేరుకున్నాయి. తిరుమల-తిరుపతి, తిరుపతి-రేణిగుంట ఎయిర్ పోర్టు మధ్య 64 బస్సులు… కడప, నెల్లూరు, మదనపల్లె పట్టణాలకు 12 చొప్పున ఈ విద్యుత్ ఆధారిత బస్సులను నడపనున్నారు. కాగా ఆదివారం సెలవు కావడంతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులతో నిండిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు పడుతున్నట్లు తెలుస్తోంది.