ఎస్సీ రిజర్వేషన్ జాక్‌పాట్.. ఏకైక అభ్యర్థిగా మల్లమ్మ ఎంపిక
వరంగల్ జిల్లా సంగెం మండలంలోని ఆశాలపల్లి గ్రామ పంచాయతీలో రిజర్వ్ సీటు కారణంగా కొంగర మల్లమ్మ సర్పంచ్‌గా ఎన్నుకోబడ్డారు. ఆ ఊరిలో 1,600 కి పైగా ఓటర్లు ఉన్నప్పటికీ, ఎస్సీ మహిళా రిజర్వ్ సీటు కారణంగా ఒక్కరే మహిళ ఉండటంతో.. మల్లమ్మకు ఈ పదవి లభించింది. గ్రామ పంచాయతీకి రిజర్వేషన్ కింద ఎస్సీ మహిళా స్థానంలో ఒక్కరు మాత్రమే ఉండటంతో సర్పంచ్ పదవి మల్లమ్మకు వెళ్లింది అని స్థానిక ఎన్నికల అధికారులు, ఎంపీడీవో రవీందర్ తెలిపారు. ఈ పరిణామం తర్వాత, అన్ని రాజకీయ పార్టీల నేతలు మల్లమ్మ వైపే చూస్తున్నారు. తమ పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నట్లు, మల్లమ్మను ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిజర్వేషన్ కారణంగా ఒక్కో వ్యక్తికి వచ్చే అవకాశం ఈ విధంగా ఊరులో రాజకీయ పరిణామాలను కూడా ప్రభావితం చేసింది. ఆశాలపల్లి గ్రామంలో రాజకీయ వర్గాలు, స్థానిక నాయకులు మల్లమ్మతో సాన్నిహిత్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన రిజర్వేషన్ వ్యవస్థలోని ప్రత్యేకతను చూపడం మాత్రమే కాక, గ్రామ స్థాయిలో స్థానిక నాయకత్వానికి కొత్త సందర్భాన్ని సృష్టించింది.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పునరుద్ధరణలో భాగంగా రాష్ట్ర కేబినెట్ ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. భారీ పెట్టుబడులకు, స్మార్ట్ ఇండస్ట్రీస్‌కు మార్గం వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. రాబోయే 30 ఏళ్ల ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ ఇండస్ట్రీస్, విమానాశ్రయం, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్, స్పోర్ట్స్ సిటీ వంటి ప్రధాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది. భూమికి నిజమైన విలువ రావాలంటే పరిశ్రమలు, ఐటి పార్కులు, గ్లోబల్ స్థాయి అభివృద్ధి అవసరం ఉందని పేర్కొన్నారు.
కోకాపేట భూముల రికార్డుల పరంపర.. ఎకరా 151 కోట్లు..!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దూకుడు చూపించింది. ప్రత్యేకించి కోకాపేట ప్రాంతంలో ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. శుక్రవారం జరిగిన HMDA వేలంలో ఎకరం ధర కొత్త రికార్డు నమోదు చేసింది. గోల్డెన్ మైల్‌లోని ప్లాట్ నెంబర్ 15కు ఎకరానికి రూ.151.25 కోట్లు పలకడం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ భూములను జీహెచ్‌ఆర్ ఇన్‌ఫ్రా అత్యధిక ధరకు సొంతం చేసుకుంది. 4.03 ఎకరాల ఈ ప్లాట్ పై మొత్తం రూ.609.55 కోట్లు హెచ్‌ఎండీఏకు లభించాయి. దీనికంటే కొద్దిగా తక్కువగా ప్లాట్ నెంబర్ 16 ధర పలికింది. ఈ ప్లాట్‌లో ఎకరానికి రూ.147.75 కోట్లకు గోద్రేజ్ సంస్థ దక్కించుకుంది. కోకాపేట నియోపోలిస్‌లో హెచ్‌ఎండీఏ నిర్వహిస్తున్న ప్లాట్ వేలం ఈ మధ్య ఇన్వెస్టర్ల పోటీని మరింత పెంచింది. ఈ ప్రాంతంలో భవిష్యత్‌లో అభివృద్ధి అవకాశాలు విపరీతంగా ఉండటంతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. డిసెంబర్ 3న నిర్వహించనున్న మిగిలిన ప్లాట్ల వేలంతో మొత్తం వేలం ప్రక్రియ పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎన్ని రికార్డులు నమోదవుతాయో రియల్ ఎస్టేట్ రంగం ఆసక్తిగా గమనిస్తోంది.
మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ.. ఆ శాఖలో ప్రక్షాళన జరగాల్సిందే..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, కేబినెట్ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, కీలక ప్రాజెక్టులు, వైద్య రంగం, రాజధాని పురోగతి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు మాట్లాడుతూ, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు అని వెల్లడించారు. అమరావతి అభివృద్ధి వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాయలసీమ అభివృద్ధిపై మాట్లాడిన సీఎం, రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది అని తెలిపారు.
టీనేజర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలను ఖండించిన OpenAI.. ఏం చెప్పిందంటే?
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ఏదైనా సమాచారం కోసం ఏఐని సంప్రదించే వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే కొన్ని సందర్భాల్లో లేని చిక్కులను కొని తెచ్చుకుంటున్నారు. గతంలో ఓ టీనేజర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై ఓపెన్ ఏఐ స్పందించింది. టీనేజర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలను ఖండించింది. కాలిఫోర్నియాలోని రాంచో శాంటా మార్గెరిటాకు చెందిన ఆడమ్ రెయిన్ అనే 16 ఏళ్ల బాలుడు ఈ సంవత్సరం ఏప్రిల్ 11న ఆత్మహత్య చేసుకున్నాడు. రెయిన్ చాట్‌జిపిటిలో గంటల తరబడి గడిపాడని, చాట్‌బాటే అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించిందని రెయిన్ తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే, కంపెనీ తాజాగా ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. యువకుడి మరణానికి చాట్‌జిపిటి బాధ్యత వహించలేదని పేర్కొంది.
బ్రహ్మోస్ కొనుగోలుకు సిద్ధమవుతున్న అతిపెద్ద ముస్లిం దేశం ..
ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా భారత బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోంది. నిజానికి భారతదేశం – ఇండోనేషియా మధ్య ఈ చారిత్రాత్మక రక్షణ ఒప్పందం చివరి దశలో ఉంది. ఇండోనేషియా త్వరలో భారతదేశంలో అత్యంత ప్రాణాంతకమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను కొనుగోలు చేస్తుందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి ఈ వార్త పొరుగున ఉన్న పాకిస్థాన్‌కు కచ్చితంగా ఆగ్రహం తెప్పిస్తుంది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ – ఇండోనేషియా రక్షణ మంత్రి సయాఫ్రి సియామ్‌సుద్దీన్‌కు బ్రహ్మోస్ క్షిపణి షిల్డ్‌ను బహుకరించారు. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి భారతదేశం – ఇండోనేషియా మధ్య ఒప్పందం ఖరారు అయ్యిందని, ఇక అధికారిక ప్రకటన వెలువడటమే ఆలస్యం అని సమాచారం. ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్‌లో బ్రహ్మోస్ క్షిపణి వాడకం గురించి ఇండోనేషియా బృందానికి ప్రత్యేక బ్రీఫింగ్ కూడా అందిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశం అయిన ఇండోనేషియా – భారతదేశం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఉగ్రదాడి జరిగినా గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు..
నవ భారత్ ఎవరి ముందు తలొగ్గదని, ప్రజలను రక్షించడంలో వెనుకాడదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శుక్రవారం ఉడిపిలో జరిగిన ‘‘లక్ష కంఠ గీత పారాయణం’’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత, భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి ప్రస్తావించారు. గత ప్రభుత్వాలు ఉగ్రవాద దాడి జరిగితే, ఎలాంటి చర్యలు తీసుకునేవి కావని, కానీ న్యూ ఇండియా తన ప్రజల్ని రక్షించడంలో వెనకడాదని చెప్పారు. శాంతి, సత్యం కోసం పనిచేయాలని, దారుణాలకు పాల్పడే వారిని అణిచివేయాలని గీత మనకు బోధిస్తుందని ప్రధాని అన్నారు.
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రూ.35 కోట్లతో ఆధునీకరణ.!
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించే పనులను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద ఈ స్టేషన్ అభివృద్ధి వేగవంతంగా కొనసాగుతుండగా, మొత్తం 35 కోట్ల రూపాయలతో అత్యాధునిక సౌకర్యాలను కల్పించే పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. సాంకేతిక ప్రగతికి కేంద్ర బిందువుగా ఉన్న హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికులు, టూరిజం రంగానికి చెందిన వారు ఉపయోగించే ఈ స్టేషన్‌ను ఆధునిక ప్రమాణాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవిలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో రైల్వే అభివృద్ధి ఎన్నడూ లేనంత వేగంగా సాగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రైల్వే లైన్ల నిర్మాణం నుంచి స్టేషన్ల ఆధునీకరణ వరకు రాష్ట్రంలో ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ జరుగుతుండటం ఇదే మొదటి సారేనని చెప్పారు. ఇటీవలే చర్లపల్లి న్యూ టర్మినల్‌ను ప్రధాని ప్రారంభించగా, హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి టర్మినల్స్‌కు తోడుగా ఇది నాలుగో ప్రధాన టర్మినల్‌గా సేవలు అందిస్తోంది.
తెలంగాణకి మెస్సీ మెగా విజిట్.!
ఫుట్‌బాల్ ప్రపంచాన్ని తన ప్రతిభతో మంత్రముగ్ధులను చేసిన ఆర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ ఈ డిసెంబర్‌లో హైదరాబాద్ రానున్నాడు. The G.O.A.T India Tour – 2025లో భాగంగా భారత పర్యటనకు సిద్ధమైన మెస్సీ, ఈ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్‌ను సందర్శించనున్నట్టు అధికారికంగా వెల్లడైంది. ఫుట్‌బాల్ అభిమానులకు ఇది అద్భుతమైన అవకాశంగా మారనుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘తెలంగాణ రైజింగ్’ గ్లోబల్ ప్రమోషన్‌లో భాగంగా, మెస్సీని రాష్ట్రానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు కలిగిన మెస్సీ, ఇండియాలో ఒక్క బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌కే సంవత్సరానికి 100 కోట్లకు పైగా వసూలు చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి సూపర్ స్టార్‌ను తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమానికి అనుసంధానం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలా..? ప్రైవేట్ ఆధీనంలో ఉండాలా..? ప్రజాభిప్రాయ సేకరణ
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు రాష్ట్ర ప్రజలకు అన్యాయం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఏ దేశంలో అయినా విద్యా, వైద్య రంగాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం అంటే పేదవాడికి, సామాన్యుడికి అందుబాటులో ఉండే సేవలు, అని బొత్స వ్యాఖ్యానించారు.వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలంలో ఐదు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తిచేసి, మిగిలిన వాటికీ నిధులు కేటాయించిన విషయం గుర్తు చేశారు.