మీకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలి వెళ్లిపోతా..
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడలో జరిగిన బహిరంగ సభలో మత్స్యకారుల సమస్యలపై స్పందిస్తూ వారికి అండగా ఉంటానని తెలిపారు. పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం కారణంగా మత్స్యకారులు పడుతున్న తీవ్ర ఇబ్బందులపై ఆయన చర్చించారు. 7193 కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయని, వారి ప్రతి కష్టంలో తాను తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. దివిస్, అరబిందో వంటి కంపెనీల నుంచి కాలుష్యం వస్తుందని మత్స్యకారులు చెప్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అమీనాబాద్ హార్బర్ డిజైన్ లోపం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయనే అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖల్లోని 31 మంది IAS అధికారుల బదిలీలు, నియామకాలు చేపట్టింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (GAD) ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ముఖ్య అధికారుల నియామకాలు, అదనపు బాధ్యతలలో కీలక వ్యక్తుల వివరాలు ఉన్నాయి. కేవీఎన్ చక్రధర్ బాబును సెకండరీ హెల్త్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌గా నియమించారు. అలానే మనజీర్ జిలానీ సమూన్ వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే పి. రవిసుభాష్ ను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సెక్రటరీగా నియమించారు.
అన్ని ఊహాగానాలకు చెక్.. 2027 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ!
టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు దిగ్గజాలు వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో రోహిత్, కోహ్లీల భవితవ్యంపై చర్చలు జరిగాయి. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఇద్దరు చోటు దక్కించుకున్నా.. ఇంకా రెండేళ్ల సమయం ఉన్న 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడడం అనుమానమే అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలకు టీమిండియా కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెక్ పెట్టాడు. ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీలు ఆడుతారని హింట్ ఇచ్చాడు.
రేపే నోబెల్ శాంతి బహుమతి ప్రకటన.. ట్రంప్‌కు వచ్చే ఛాన్స్ ఉందా! రేసులో ఎవరెవరు ఉన్నారంటే?
అగ్రరాజ్యాధిపతి మనసు నోబెల్ శాంతి బహుమతి వైపు మళ్లింది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు విభాగాల్లో నోబెల్ బహుమతులు ప్రకటించారు. ట్రంప్ ఆశగా ఎదురు చూస్తున్న నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం నార్వేలోని ఓస్లోలో ఉన్న నోబెల్ కమిటీ ప్రకటిస్తుంది. ఇంతకీ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి వస్తుందా.. పలు సందర్భాల్లో ప్రపంచ వేదికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాను ఎనిమిది యుద్ధాలను ఆపినందుకు, తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని పదేపదే చెబుతూ వచ్చారు. అయితే ట్రంప్ వాదనలపై నిపుణుల అభిప్రాయం పూర్తిగా భిన్నంగా ఉంది. ట్రంప్‌ను నోబెల్ కమిటీ ఎంపిక చేయదని పలువురు నిపుణులు చెబుతున్నారు. అణ్వాయుధ దేశాలైన భారతదేశం – పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ ఇప్పటి వరకు 50 సార్లకు పైగా పేర్కొన్నారు. కానీ ఈ వాదనను భారత్ ఖండించింది. స్వీడిష్ ప్రొఫెసర్, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు పీటర్ వాలెన్‌స్టెయిన్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది నోబెల్ బహుమతిని అందుకోరనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బహుమతి ప్రకటించే నాటికి గాజా యుద్ధం ఆగిపోయి ఉంటుంది కాబట్టి, వచ్చే ఏడాది ఆయన కల నెరవేరవచ్చని అన్నారు. ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రశ్న ఆసక్తిగా మారింది.. ట్రంప్ నోబెల్ బహుమతి గెలుచుకోకపోతే, ఎవరు గెలుస్తారు.
టికెట్ లేకుండా పట్టుబడ్డ ఉపాధ్యాయురాలు.. టీసీ వేధిస్తున్నాడంటూ రివర్స్‌లో వాగ్వాదం
ఆమె ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. గౌరవ ప్రదమైన వృత్తిలో ఉంది. పది మందిని సన్మార్గంలో నడిపించాల్సిన పండితులమ్మ బుద్ధిహీనురాలిలా ప్రవర్తించింది. టికెట్ తీసుకుని రైల్లో ప్రయాణించాల్సిన ఆమె.. దర్జాగా ఏసీ కోచ్‌లో కూర్చుని జర్నీ చేస్తోంది. టికెట్ చూపించమన్న పాపానికి టిక్కెట్ కలెక్టర్ వేధిస్తున్నాడంటూ రివర్స్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏసీ కోచ్‌లో మహిళా ఉపాధ్యాయురాలు ప్రయాణం చేస్తోంది. ఇంతలో టీటీఈ వచ్చి టికెట్ చూపించమని అడిగాడు. దీంతో ఆమె తాను బీహార్ ప్రభుత్వ టీచర్‌ను అని చెప్పుకొచ్చింది. అదేమీ పట్టించుకోకుండా మళ్లీ టికెట్ చూపించమని అడిగాడు. దీంతో ఆమె రివర్స్ అయి ‘‘నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నావు.’’ అని ఎదురుదాడికి దిగింది. ఇందుకు సంబంధించిన మాటలు వీడియోలో స్పష్టంగా వినిపించాయి.
భారత్‌కు తాలిబాన్ మంత్రి.. పాకిస్తాన్‌లో భయం ఎందుకంటే..?
2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో పౌర ప్రభుత్వాన్ని దించి తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి భారత్-ఆఫ్ఘాన్ మధ్య తెరవెనక దౌత్య సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికీ, తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. కానీ, ఇప్పుడు మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ఆఫ్ఘాన్ అవసరం భారత్‌కు ఎంతో ఉంది. అదే విధంగా తాలిబాన్లకు కూడా భారత్ కావాలి. ఈ నేపథ్యంలోనే, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ పర్యటనలో ముత్తాకీ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే, భారత్-ఆఫ్ఘాన్‌లు దగ్గర కావడం పాకిస్తాన్‌కు నచ్చడం లేదు. తాలిబాన్ మంత్రి భారత్ పర్యటనకు వస్తుంటే, పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఈ పరిణామాలను పాక్ నిశితంగా గమనిస్తోంది. పాకిస్తాన్ నిపుణుడు నజామ్, ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్‌లో రాసిన ఒక వ్యాసంలో.. తాలిబాన్ మంత్రిపై యూఎన్ ట్రావెల్ బ్యాన్ ఎత్తేయడం దక్షిణాసియా దౌత్యంలో ముఖ్యమైందని రాశాడు. రష్యాతో సమావేశాల తర్వాత ముత్తాకీ భారత పర్యటన, ఆఫ్ఘాన్ ప్రాంతీయ సంబంధాలను పునరుద్ధరించాలనే ఉద్దేశాన్ని సూచిస్తోందని అన్నారు. ఈ పరిణామం పాకిస్తాన్‌కు వ్యూహాత్మక, మానవతా, భద్రతాపరమైన చిక్కుల్ని తెస్తాయని వ్యాసంలో చెప్పుకొచ్చారు.
నెల్లూరులో పర్యటించనున్న సీఎం..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు అమరావతి సచివాలయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సీఎం నెల్లూరు చేరుకోనున్నారు. నెల్లూరు అర్బన్ లోని మైపాడు గేట్ వద్ద చిరు వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. 30 కంటైనర్లతో సిద్ధం చేసిన 120 షాప్ లను సీఎం పరిశీలించనున్నారు. ఆ కార్యక్రమం అనంతరం వెంకటాచలం మండలం, ఎడగాలి గ్రామానికి చేరుకుని అక్కడ నిర్మించిన నంద గోకులం లైఫ్ స్కూల్‌ను సీఎం ప్రారంభిస్తారు. అక్కడి విద్యార్దులతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. అక్కడికి సమీపంలోనే గోశాలకు హాజరై నంది పవర్ ట్రెడ్ మిల్ మిషిన్, నంద గోకులం సేవ్ ద బుల్ ప్రాజెక్టులు, ఎడగాలిలో నూతనంగా నిర్మించిన విశ్వసముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు సీఎం విజయవాడ చేరుకోనున్నారు.
భారత్-యూకే సహకారం కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది
భారత్-యూకే సహకారం కొత్త శిఖరాలకు తీసుకెళ్లబోతున్నాయని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబైలో ఇండియా-యూకే సీఈవో ఫోరమ్‌లో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. ‘‘అణు విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ రంగానికి తెరుస్తున్నామని ప్రకటించడానికి సంతోషంగా ఉన్నాను. ఇవన్నీ భారతదేశం-యూకే సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయి. ఈ అభివృద్ధి ప్రయాణంలో భారతదేశంలో చేరాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.’’ అని మోడీ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య సుమారు 56 బిలియన్ల వాణిజ్యం కుదిరింది. 2030 నాటికి రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే లక్ష్యాన్ని అనుకున్నదానికంటే ముందుగానే సాధించగలమన్న నమ్మకం ఉందని మోడీ అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి ఇటీవల తెలంగాణ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి బీసీ రాజకీయాలను ఉపయోగించి దద్దమ్మ పాలనను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఒక విధంగా మాటలు చెప్పి, తర్వాత మరో విధంగా ప్రవర్తించడం రేవంత్ రెడ్డికి కొత్త విషయమేమీ కాదు అని పేర్కొన్నారు. అరవింద్ ధర్మపురి ప్రశ్నించారు, కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ను లోపల ఎందుకు ఉంచలేదు, కేటీఆర్‌ను లోపల ఎందుకు ఉంచలేదు, కవిత రాజీనామాను ఎందుకు ఆమోదించకపోతున్నారు అని. హరీష్ పాల వ్యాపారం, సంతోష్ టానిక్ సంబంధిత అంశాలను, అలాగే కల్వకుంట్ల కుటుంబంతో చేసిన ఒప్పందం బయటకు రాకుండా చేయడానికి రేవంత్ బీసీ లను రాజకీయ వ్యూహంగా వాడుతున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం ‘కుట్ర’ చేస్తోంది.. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ.. పేదవారికి వైద్యం ఎలా?
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై మాజీ సీఎం, ఎమ్మెల్యే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన ఆయన, ప్రభుత్వం చేపడుతున్న ప్రైవేటీకరణను “కుట్ర”గా వర్ణించారు. పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంగా మార్చడం ద్వారా వారిని అన్యాయానికి లోనుచేస్తారని జగన్ ఆరోపించారు. తమ పాలనలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబడిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం వల్ల పేదవారికి వైద్యం అందించడం అసాధ్యమవుతుందని, అందుకే ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి తెచ్చినట్లని పేర్కొన్నారు. నర్సీపట్నంలో 52 ఎకరాల్లో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టడం, కోవిడ్ సంక్షోభంలో రూ.500 కోట్లు ఖర్చు చేసి, ఈ మెడికల్ కాలేజీ పూర్తయిన తర్వాత 600 బెడ్లతో పేదలకు ఉచిత వైద్యం అందించనున్నట్టు జగన్ అన్నారు.