ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. ఎందుకు ప్రశ్నించడం లేదు!
జనసేన పార్టీ స్థాపించిందే ప్రశ్నించడానికి అని చెప్పిన పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ప్రశ్నించకుండా ముసిముసి నవ్వులు నవ్వుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. గ్రామాల్లోకి వెళ్ళి చూడండని.. కూల్ డ్రింక్స్ ఎలా దొరుకుతాయో మందు అలానే దొరుకుతుందని ఎద్దేవా చేశారు. ఇంత మద్యం అమ్మిన మూడు శాతమే ఆదాయం ఎందుకు పెరిగిందని.. పది శాతం పెరగాల్సిన ఆదాయం మూడు శాతం ఎలా ఉంది.. ఎవరి చేతిలోకి ఆదాయం వెళ్తుందని ప్రశ్నించారు. మీరు చేస్తే సంపద సృష్టి అని.. మేము చేస్తే తప్పా అని బుగ్గన మండిపడ్డారు.
ఆస్ట్రేలియాను వణికించిన కాల్పులు.. ఉగ్రదాడిలో 10 మంది మృతి.. వైరల్‌గా మారిన వీడియో
సామూహిక కాల్పులతో ఆస్ట్రేలియా ఒక్కసారిగా వణికిపోయింది. ఆదివారం సిడ్నీలోని బోండి బీచ్‌లో జరిగిన సామూహిక కాల్పుల్లో కనీసం 10 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘోర సంఘటన తర్వాత పోలీసులు పర్యాటక ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఈ ఘటనలో అనేక మందిపై కాల్పులు జరిగాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ సంఘటన తర్వాత న్యూ సౌత్ వేల్స్ పోలీసులు మాట్లాడుతూ.. బీచ్, పరిసర ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరుతూ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. అధికారులు రంగంలోకి దిగారని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో తుపాకీ చప్పులు, పోలీసు వాహనాల సైరన్లు వినిపించడంతో బీచ్‌కి వెళ్లేవారు ఆ ప్రాంతం నుంచి పారిపోతున్నట్లు కనిపించింది. పలువురు స్థానికులు మాట్లాడుతూ.. బోండి బీచ్‌లోని ఒక వంతెన దగ్గర నల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు, భయంతో ప్రజలు కేకలు వేస్తూ పరుగులు పెట్టినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. పోలీసుల కాల్పులలో ఒకరు మృతి చెందగా, మరొకరు పట్టుబడినట్లు పేర్కొన్నారు.
లెఫ్ట్ కూటమి ఓడిపాయె.. ‘‘మీసాలు’’ పోయె..
కేరళ లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) ఘోర పరాజయం పాలైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రండ్(యూడీఎఫ్) అధిక స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, బీజేపీ కూడా తన రాష్ట్ర రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, వామపక్ష కూటమి విజయంపై ధీమా వ్యక్తం చేసిన లెఫ్ట్ కార్యకర్త ఒకరు తన ‘‘మీసం’’ కోల్పోవాల్సి వచ్చింది. పతనంతిట్ట మన్సిపాలిటీ ఎన్నికల ముందు, ఈ ప్రాంతంలో ఎల్డీఎఫ్ తన అధికారాన్ని నిలుపుకోకపోతే తానున మీసాలు తీసేస్తానని వామపక్ష కార్యకర్త బాబు వర్గీస్ బహిరంగంగా ప్రతిజ్ఞ చేశాడు. శనివారం ఎన్నికల ఫలితాల్లో పతనంతిట్ట మున్సిపాలిటీ మాత్రమే కాకుండా, ఆ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికార ఎల్డీఎఫ్ కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ పతనంతిట్ట, తిరువల్ల, పండలంతో సహా నాలుగు మున్సిపాలిటీలను గెలుచుకుంది. గతంలో ఈ మూడు వామపక్షాల ఆధీనంలో ఉండేవి.
ఈ-కేవైసీ లేకపోతే రేషన్ కట్.!
రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రేషన్ కార్డుల్లో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పలుమార్లు సూచనలు ఇచ్చినా, ఇప్పటికీ చాలా మంది ఈ ప్రక్రియను పూర్తిచేయకపోవడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తి చేయని యూనిట్లకు రేషన్ సరఫరా నిలిపివేస్తామని మరోసారి హెచ్చరించారు. రేషన్ కార్డులో నమోదైన సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ-పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తయ్యిన వారికే రేషన్ సరఫరా జరుగుతుందని, లేకపోతే కోటా రద్దు అవుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుదారుల్లో ఆందోళన నెలకొంది.
జనం నుంచి మంచి స్పందన వస్తోంది
‘జనం బాట’ కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా మమేకమవుతున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 13 జిల్లాల్లో జనం బాట కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, ఇంకా 20 జిల్లాలు తిరగాల్సి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలుగుతోందని ఆమె పేర్కొన్నారు. ప్రజల్లో ముఖ్యంగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని కవిత తెలిపారు. రాజకీయ కారణాల వల్లే గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రకటనలు చేస్తున్నారని, కానీ వాస్తవంగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదని అన్నారు.
ఈనెల 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ కీలక సమావేశం
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19న పార్టీకి చెందిన కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ఎస్ ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రజా ఉద్యమాలు, పార్టీ కార్యాచరణ, సంస్థాగత నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రత్యేకంగా కృష్ణా-గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరగనుంది. బీఆర్‌ఎస్ హయాంలో ప్రారంభించి నిర్మాణం చేపట్టిన కీలక సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జలదోపిడిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
పాక్ మాదిరిగానే బంగ్లాదేశ్‌లో ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’.. భారత మ్యాప్‌ని కించపరిచినందుకు శిక్ష..
పాకిస్తాన్ వ్యాప్తంగా గత కొంత కాలంగా ‘‘గుర్తు తెలియని వ్యక్తులు’’ భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని హతమారుస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో చనిపోయారు. హఠాత్తుగా ఒకరు, ఇద్దరు బైక్‌పై వస్తారు, తమ లక్ష్యంగా ఉన్న ఉగ్రవాది దగ్గరకు వచ్చి, గుండెల్లో బుల్లెట్లు దించి, క్షణాల్లో అక్కడ నుంచి పరారవుతుంటారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్క ‘‘గుర్తు తెలియని వ్యక్తి’’ని పట్టుకోలేకపోయింది. కొన్ని సందర్భాల్లో ఈ దాడుల వెనక భారత గూఢచార సంస్థ ఉందని ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాకిస్తాన్ మాదిరిగానే ‘‘గుర్తు తెలియని వ్యక్తులు’’ బంగ్లాదేశ్‌లోకి ఎంటరైనట్లు తెలుస్తోంది. తాజాగా, రాజధాని ఢాకాలో రాడికల్ ఇస్లామిస్ట్ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదిని అతి దగ్గర నుంచి కాల్చారు. తీవ్ర గాయాలైన హాదిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. షేక్ హసీనా గతేడాది ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. ఆ తర్వాత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడయ్యాడు. దీని తర్వాత, బంగ్లా వ్యాప్తంగా మతోన్మాదం, భారత వ్యతిరేకత పెరిగింది.
ఇది ఇజ్రాయిల్ అంటే.. అక్టోబర్ 7 దాడుల హమాస్ కమాండర్ హతం..
అక్టోబర్ 07, 2023న ఇజ్రాయిల్‌పై హమాస్ భీకర ఉగ్రదాడి చేసింది. 1200 మందిని క్రూరంగా హతమార్చింది. చాలా మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాలోని హమాస్‌పై, లెబనాన్‌లోని హిజ్బుల్లాపై దాడులు చేసి, ఈ రెండు ఉగ్రవాద సంస్థల్ని నామరూపాలు లేకుండా చేస్తోంది. ఇప్పటికే హమాస్‌కు చెందిన టాప్ లీడర్లు ఇస్మాయిల్ హానియే, యాహ్యా సిన్వార్‌లను హతమార్చింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను వెతికి వేటాడి చంపేసింది.
మెదక్ జిల్లాలో హైడ్రామా.. సానుభూతి ఓట్ల కోసం ఏకంగా భర్తనే..!
అసెంబ్లీ ఎన్నికలైనా.. మున్సిపల్ ఎన్నికలైనా.. గ్రామపంచాయతీ ఎన్నికలైనా.. ప్రలోభాల పర్వం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు అడ్డగోలుగా నగదు, మద్యం పంపిణీ చేస్తారు. ఏరియాను బట్టి ఓటుకు రూ.2-5 వేల వరకు కూడా ముట్టజెబుతారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో ఇదే జరుగుతోంది. అయితే గెలుపు కోసం కొందరు అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులనే ఎరగా వేస్తున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఊహించని విషయం మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో హైడ్రామా చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి సబిత భర్త నిన్న రాత్రి అదృశ్యం అయ్యాడు. తన భర్తను ప్రత్యర్ధులు కిడ్నాప్ చేసి హత్య చేశారని గ్రామంలో సబిత ప్రచారం చేశారు. తన భర్త కనిపించడం లేదంటూ సబిత పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రోన్లు, జాగిలాలతో గాలించారు. చివరకు సబిత భర్త జనార్ధన్ రెడ్డిని పట్టుకున్నారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.
ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్!
తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగయగా.. ఒంటి గంట లోపు క్యూలైన్లో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు ఎన్నికల అధికారుల అంచనా వేస్తున్నారు. పూర్తి స్తాయి పోలింగ్ శాతం రావడానికి మరింత సమయం పట్టనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. సర్పంచ్, వార్డు మెంబర్ల బ్యాలెట్ పేపర్లను వేరు వేరు చేయనున్నారు. సిబ్బంది బ్యాలెట్ పేపర్లను బండిల్స్ చేసి 25గా కట్టలు కట్టనున్నారు. అనంతరం అధికారులు కౌంటింగ్ చేయనున్నారు. కౌంటింగ్ రాత్రి వరకు కొనసాగనుంది. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి.. ఉప సర్పంచి ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో దశలో 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరిగింది. ఈనెల 17న మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.