తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై ఆయన క్షమాపణ కోరారు. తప్పు జరిగింది.. క్షమించాలని విన్నవించారు. తిరుపతిలో పవన్ మీడియాతో మాట్లాడారు. ఇంత మంది అధికారులున్నా.. ఆరుగురి ప్రాణాలు పోవడం సరికాదన్నారు. తొక్కిసలాట జరిగినప్పుడు పోలీసులు.. భక్తులను కంట్రోల్ చేయలేరా? అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి పూర్తిగా విఫలమయ్యారంటూ ఫైరయ్యారు.
అభిమానులు, పోలీసులపై ఫైర్
అభిమానులు, పోలీసుల తీరుపై కూడా పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చనిపోయినా బాధ్యతగా వ్యవహరించరా అంటూ మండిపడ్డారు. అధికారుల తీరు కారణంగా సీఎం చంద్రబాబుకు చెడ్డపేరు వస్తోందన్నారు. అధికారులు తక్షణమే మేల్కోవాలని కోరారు.
కుట్ర అనుమానం!
పోలీసులను అడ్డుపెట్టుకుని కుట్ర జరిగిందేమోనన్న అనుమానం కలుగుతుందని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులను క్యూలైన్లలో నిలబెట్టడమేంటి? టీటీడీ ఉంది వీఐపీల కోసం కాదు.. సామాన్య భక్తులకు సేవ చేయడానికి ఉందన్నారు. ఇప్పటికైనా పరిస్థితుల్లో మార్పు రావాలని పవన్ కల్యాణ్ కోరారు.