Tirumala: ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుమల చేరుకునే భక్తులకు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి కీలక సూచనలు చేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 4వేల మంది సిబ్బందితో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 2వేల మంది పోలీసులు అదనంగా గరుడ సేవ కోసం సేవలు అందిస్తారని.. మొత్తం 6వేల మంది పోలీసులు బ్రహ్మోత్సవాలలో పాల్గొంటారని తెలిపారు. ఈనెల 27న తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని.. ఈనెల 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు సీఎం పర్యటన ఉంటుందని పేర్కొన్నారు. తొలిరోజు పర్యటనలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి.. మరుసటి రోజు తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మను సీఎం జగన్ దర్శించుకుంటారని జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి వివరించారు.
Read Also:Russia-Ukraine War: రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు.. రూ.35వేల కోట్లు ఆదా చేసిన భారత్
అటు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే సేవా టిక్కెట్లు కొనుగోలు చేయాలని.. దళారులను నమ్మి మోసపోవద్దని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి సూచించారు. తిరుమలలో ఎలాంటి దొంగతనాలు జరగకుండా 400 మంది పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. తిరుమలలో 38 పార్కింగ్ స్థలాలు గుర్తించామని.. తిరుపతిలో పది వేల వాహనాలు అదనంగా పార్క్ చేసే విధంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. తిరుమల మాఢవీధులలో గ్యాలరీ కెపాసిటీ లక్ష 80 వేల మంది వరకు ఉందని.. గరుడ వాహన సేవ రోజు 3-4 లక్షలు మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఈనెల 30 నుంచి అక్టోబర్ 2 వరకు వరకు తిరుమలకు ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదన్నారు. తిరుమలలో 2800 సీసీ కెమెరాలు, తిరుపతిలో 1300 సీసీ కెమెరాల్లో నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. తిరుమలకు బ్రహ్మోత్సవాల సందర్భంగా తరలివచ్చే భక్తులు విలువైన వస్తువులు తీసుకు రావొద్దని ఎస్పీ పరమేశ్వరరెడ్డి సూచించారు. చిన్నారులకు, వృద్ధులకు జియో ట్యాగింగ్ అందుబాటులో ఉంచుతామన్నారు. బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో తిరుపతిలో చెక్ పోస్టుల ఏర్పాటు, వాహన తనిఖీలు ఉంటాయన్నారు.