తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి ప్రాణదాన ట్రస్టుకు ఆన్‌లైన్‌లో విరాళాల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇందులో భాగంగా రూ.కోటి విరాళాలు అందించిన భక్తులకు టీటీడీ ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు కేటాయిస్తోంది. శుక్రవారం రోజు ఈ సేవ పొందాలంటే రూ.1.5 కోట్లు విరాళంగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు బుధవారం 531 టిక్కెట్లను టీటీడీ అధికారులు అందుబాటులో ఉంచగా.. ఇప్పటివరకు రూ.82 కోట్ల విరాళాలకు సంబంధించి 68 టిక్కెట్లను మాత్రమే భక్తులు పొందారు. ఇందులో శుక్రవారం టిక్కెట్లు 28 ఉండగా.. మిగిలిన రోజులకు సంబంధించిన టిక్కెట్లు 40 ఉన్నాయి.
ఉదయాస్తమాన ఆర్జిత సేవా టిక్కెట్ల ద్వారా శ్రీవారి భక్తులు అందించే విరాళాలను తిరుపతిలోని చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అభివృద్ధికి ప్రత్యేకంగా వినియోగించనున్నారు. దాతలను ప్రోత్సహించేందుకే ఈ ఉదయాస్తమాన ఆర్జిత సేవా టిక్కెట్లను అమలు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.