TTD Hundi New Record: కొలిచినవారి కొంగుబంగారం, కలియుగ ప్రత్యక్షదైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం కొత్త రికార్డు సృష్టించింది.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వీవీఐపీలు, వీఐపీలు, ప్రముఖులు, భక్తులు పోటెత్తారు.. హుండీ ద్వారా శ్రీవారికి పెద్ద సంఖ్యలో కానుకలు సమర్పించుకున్నారు. దీంతో.. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనంత హుండీ ఆదాయం సమకూరింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించారు. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తిరుమలలో భక్తులు హుండీలలో స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కించగా ఏకంగా రూ.7.68 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది.. ఒకేరోజు ఇంత పెద్ద మొత్తంలో హుండీ ద్వారా కానుకలు రావడం ఇదే తొలిసారి కావడంతో.. శ్రీవారి హుండీ ఆదాయం కొత్త రికార్డులు సృష్టించింది.. అయితే, ఇప్పటి వరకు గత ఏడాది అక్టోబర్ 23వ తేదీన లభించిన రూ.6.31 కోట్ల హుండీ ఆదాయమే అత్యధికంగా ఉండగా.. ఆ రికార్డులు ఇప్పుడు బ్రేక్ అయిపోయాయి.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, కరోనా మహమ్మారి తర్వాత సాధారణ పరిస్థితులు రావడంతో.. క్రమంగా శ్రీవారి హుండీ ఆదాయం పెరుగుతూ వచ్చింది.. 2022లో శ్రీవారికి భక్తులు రూ. 1446 కోట్లను హుండీలో సమర్పించుకున్నారు.. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు శ్రీవారిని 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా.. 1.08 కోట్ల మంది తలనీలాలు సమర్పించారు. అయితే, గత ఏడాదిలో వరుసగా 10 నెలల పాటు శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసింది.. ఇక, 2023 జనవరి ఆదిలోనే వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2వ తేదీన శ్రీవారి హుండీ కొత్త రికార్డులు సృష్టించడంతో.. జనవరిలో కూడా భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.. వైకుంఠద్వార దర్శనం కోసం భక్తుల పెద్ద ఎత్తున తరలివస్తారనే అంచనాలతో.. పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ.. ఇప్పటికే ఆన్‌లైన్‌లో రూ.300, ఆఫ్‌లైన్‌లో ఎస్‌ఎస్‌డీ టోకెన్లను భక్తులు పొందారు. వారికి కేటాయించిన సమయాల్లో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తున్నారు.