తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను మే 21న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది.
మరోవైపు వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జూన్ 30 వరకు అష్టదళపాద పద్మారాధన, తిరుప్పావడ సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు టీటీడీ గతంలో ప్రకటించింది. అయితే ప్రతి మంగళవారం నిర్వహించే అష్టదళపాద పద్మారాధన సేవా టికెట్లను జూన్ వరకు ఆన్‌లైన్ విడుదల చేయడంతో భక్తులు బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం సేవా టికెట్లు బుక్ చేసుకున్న వారిని అష్టదళ పాదపద్మారాధన సేవకు అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే అడ్వాన్స్ బుకింగ్‌లో జూన్ 30 వరకు తిరుప్పావడ సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఆయా తేదీల్లో బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని లేదంటే రీఫండ్ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.