Venkaiah Naidu: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీరోజూ వేలాది మంది తరలివస్తుంటారు.. ఒక ఏదైనా ప్రత్యేకమైన రోజు ఉందంటే చాలు.. వీఐపీల తాకిడి ఉంటుంది.. అయితే, కొన్నిసార్లు వీఐపీల తాకిడితో సామాన్య భక్తులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.. అయితే, తిరుమలలో వీఐపీల దర్శనంపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. వీఐపీలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలంటూ సూచించారు.. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి నిన్న తిరుమల చేరుకున్న వెంకయ్య నాయుడు.. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా.. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకయ్యనాయుడు.. టీటీడీ నిధుల వ్యయంలో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు.. టీటీడీ నిధులను శ్రీవారి భక్తుల సౌకర్యాలకే వినియోగించాలన్నారు వెంకయ్య నాయుడు. మరోవైపు ఊరుకో గుడి.. బడి ఉండాలని.. బడి ఏర్పాటు బాధ్యత ప్రభుత్వాన్నిదైతే.. కానీ, గుడి నిర్మాణ బాధ్యతను టీటీడీ తీసుకోవాలన్నారు వెంకయ్య నాయుడు.
Read Also: Chairman’s Desk: హిందూ మతానికి, రాజకీయానికి సంబంధమేంటి..? హిందువులకు కొత్త పాఠాలేంటి..?
మరోవైపు, కన్నడ హీరో శివరాజ్ కుమార్, దర్శకుడు గోపీచంద్ మలినేని వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న కన్నడ హీరో శివ రాజ్ కుమార్ వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఇక, తన మిత్రులతో కలిసి తిరుమల విచ్చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. 12 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ వెల్లడించింది.. నిన్న శ్రీవారిని 85,486 మంది భక్తులు దర్శించుకోగా.. 30,929 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.3.85 కోట్లుగా ప్రకటించింది టీటీడీ..