శ్రీకాకుళం జిల్లాలో విచిత్రం చోటు చేసుకుంది. కంచిలి మండలం జడిపుడి గ్రామంలో జామి ఎల్లమ్మ ఆలయంలో సోమవారం రాత్రి ఓ వ్యక్తి దొంగతనానికి వెళ్లాడు. పొరుగు గ్రామానికి చెందిన పాపారావు అనే వ్యక్తి ఆలయంలో చోరీకి ప్రయత్నించాడు. తొలుత అతడు గోడకు ఓ వైపున చిన్న రంధ్రం పెట్టి గుడిలోకి ప్రవేశించాడు. అయితే గుడి లోపలకు బాగానే వెళ్లిన దొంగ.. హుండీలో కానుకలు, అమ్మవారి నగలు దొంగతనం చేసి బయటకు మాత్రం రాలేకపోయాడు. తిరిగి వస్తూ అతడు చిన్న రంధ్రంలోనే ఇరుక్కుపోయాడు.
తెల్లవారిన తర్వాత దొంగ గ్రామస్తుల కంటపడ్డాడు. తనను ఎలాగైనా బయటకు తీసి కాపాడాలంటూ గ్రామస్తులను దొంగ పాపారావు వేడుకున్నాడు. గుడిలో బంగారు, వెండి వస్తువులను తీసుకుని తిరిగి బయటపడే క్రమంలో దొంగ ఇరుక్కుపోయినట్లు గుర్తించిన గ్రామస్తులు దొంగను కిటికీలో నుంచి బయటకు తీశారు. అనంతరం కంచిలి పోలీసులకు అప్పగించారు. దొంగ కన్నంలో ఇరుక్కుపోయిన ఘటనను కొందరు స్థానికులు వీడియో తీశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.