ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ కుప్పంలో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు కట్టి సందడి చేశారు. దీంతో ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ సంఘం అధ్యక్షుడు శివ పీసీ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని, టీడీపీకే పనిచేస్తున్నామని కుప్పం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలిపారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతోనే సీఎం ఎన్టీఆర్ అనే నినాదాలు చేశామని, రాష్ట్రం లోని ఎన్టీఆర్ అభిమానులకు సైతం జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలన్న ఆశ, ఆకాంక్ష వుందన్నారు. కానీ.. కొంతమంది దీన్ని రాజకీయం చేస్తున్నారని తారక్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, నారా రెండు ఫ్యామిలీలు ఒక్కటిగానే ఉన్నప్పుడు వారి మధ్య విబేధాలు సృష్టించాలని పని గట్టుకుని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు.